చిరు ఒక్కరే హ్యాపీ : గంటా
షికాగో: అత్తెసరు మార్కులతో పాసయ్యామంటూ అధికారం లోకి వచ్చిన వైఎస్ అంసతృప్తితో ఉన్నారని, ఎంత చేసినా ముఖ్యమంత్రి పదవి దక్కలేదని 92 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబూ అసంతృప్తితోనే ఉన్నారని, కేవలం పద్దెనిమిది సీట్లు వచ్చినా సంతోషంగా ఉన్న ఏకైక నాయకుడు చిరంజీవేనని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాజకీయాలలో చిరంజీవి అంత పరిణతి కనబరచిన నాయకుణ్ణి తాను చూడలేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబమాను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో మార్పు కోసం అన్న నినాదంతో చిరంజీవి ఎన్నికల్లో పాల్గొన్నారని, ఇప్పటికీ ఒబమా విధానాలలో ఆదర్శప్రాయమైన వాటిని అనుసరించడానికి ప్రజారాజ్యం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రవాసాంధ్రుల విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీలో ప్రవాసాంధ్రుల ప్రాధాన్యతను పెంచడానికి, రాష్ట్ర రాజకీయాలలో వారికి క్రీయాశీలక పాత్రను కల్పించడానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. తానా సమావేశాలలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన శ్రీనివాసరావు `తెలుగు పీపుల్' కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను గురించి, ప్రజారాజ్యం పార్టీ భవిష్యత్ కార్యచరణను గురించి వివరించారు.
అమెరికాలో తెలుగువారు చాలా చక్కగా జీవిస్తున్నారని, మంచి ప్రగతిని సాధించారని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా దేశ ఆర్ధిక ప్రగతిలో తెలుగువారి భాగస్వామ్యం గణనీయంగా ఉండటాన్ని తాను గమనించానని, ఒబమా ఎన్నికలో కూడా తెలుగువారు కీలకపాత్ర పోషించడం గర్వకారణమని ఆయన చెప్పారు. ఆర్ధికంగా అమెరికా తెలుగు ప్రజలు అభివృద్ధిని సాధించారని, వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకుని ఐక్యంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇబ్బందుల్లో ఉంటే కొత్త సంఘాలు పెట్టుకోలేరని, కొత్త సంఘాలు రావడం కూడా ఒక విధంగా మంచిదేన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Pages: 1 -2- News Posted: 3 July, 2009
|