తానా శాశ్వతం: కాకరాల
షికాగో : పదవుల్లో ఎవరు ఉన్నా వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా తెలుగువారి సంక్షేమం కోసం పాటు పడాలని తానా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి కాకరాల పిలుపు ఇచ్చారు. తానా ఆశయాలకు కట్టుబడి, ఆశ్రిత పక్షపాతానికి తావివ్వకుండా ఉంటే సంఘంలో ఎలాంటి రాజకీయాలకు తావుండదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వచ్ఛందసేవలో, దాతృత్వంలో ఆమెరిగా తెలుగువారు ఉదారంగానే ఉన్నారని అయితే వారు ప్రస్తుతం ఉన్న ఆర్ధిక స్థితిని బట్టి సామాజిక సేవా కార్యక్రమాలను మరింత మెరుగుగా చేపట్టవచ్చని ఆయన చెప్పారు. స్వచ్ఛంద సేవలో, సేవాకార్యక్రమాలలో అమెరికా పౌరులను మించిన వారు ప్రపంచంలోనే లేరని, యూరప్ దేశాల ప్రజలు కూడా తమ సంపాదనలో ఎక్కువ భాగం స్వచ్ఛంద సేవకు వినియోగిస్తున్నారని ఆయన వివరించారు. పేదలను ఆదుకోవడంలో, అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను అమెరికా తెలుగువారు కూడా చైతన్యంతోనే ఉన్నారని ఆయన తెలిపారు. తానా వేడుకల నిర్వహణలో తలమునకలై ఉన్న కాకరాల `తెలుగు పీపుల్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఏటా తానాకు పది లక్షల డాలర్లు విరాళాలుగా అందుతాయని, తానా ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని భారతదేశంలోనే వెచ్చిస్తున్నామని కాకరాల వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, వైద్య సహాయ శిబిరాల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకూ వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని దాదాపు 25 వేల మందికి శస్త్ర చికిత్సలు చేయించామని ఆయన వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత 11 మిలియన్ డాలర్లను ఆంధ్ర రాష్ట్రంలో సేవా కార్యక్రమాలకు వినియోగించామన్నారు. అంతే కాకుండా అమెరికా ఆంధ్రులు వ్యక్తిగతంగా కూడా నిధులను సేకరించి తమ తమ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని కాకరాల చెప్పారు.
Pages: 1 -2- News Posted: 4 July, 2009
|