'ఘంటా' అభినందన సభ
న్యూజెర్సీ : 'అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేం. అలాగే తెలుగువాడి వైభవాన్ని ప్రపంచంలో ఏ మూలనున్నా ఆపలేం.' నిస్వార్థ ప్రజా సేవతో నిరంతరం ప్రజల బాగు కోసమే శ్రమిస్తున్న ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావును అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ లో ఉన్న ప్యాలస్ ఆఫ్ జైపూర్ జూలై 11 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఘంటా శ్రీనివాసరావు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసరావును సన్మానించిన జైపూర్ ప్యాలస్ లోని బ్యాంక్వెట్ హాలు న్యూయార్క్, పెన్సిల్వేనియా, డెలావేర్, బోస్టన్, వాషింగ్టన్ నగరాల నుంచి హాజరైన ప్రవాసాంధ్రులతో కిక్కిరిసిపోయింది. మాజీ ఈబీసీ రేడియో యాంకర్ వాణి కివి కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తివంతంగా నిర్వహించారు. అతిథులను సభా వేదిక మీదకు ఆహ్వానించి, పరిచయం చేశారు. అమెరికా, భారతదేశాల జాతీయగీతాల ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది.
సభా కార్యక్రమంలో గనగోని శ్రీనివాస్ మాట్లాడుతూ, పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు తొలిసారిగా అమెరికా సందర్శనకు రావడం, విలువైన సమయాన్ని ప్రవాసాంధ్రుల కోసం వెచ్చించడం అభినందనీయం అన్నారు. దాము గేదల మాట్లాడుతూ, 'శ్రీనివాసరావు ఇంటి పేరు ఘంటా అని, ఆయన ఏది మాట్లాడినా ఘంటాపథంగా మాట్లాడతార'ని అభివర్ణించారు. అంత కన్నా ముఖ్యంగా శ్రీనివాసరావు స్వచ్ఛమైన మనస్సున్న వారైనందున ప్రతి ఒక్కరూ అభిమానిస్తారన్నారు.
అనంతరం ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, న్యూజెర్సీకి వచ్చిన ప్రవాసాంధ్రులను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిరంతరం బిజీగా ఉండే ప్రవాసాంధ్రులు ఈ 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం ద్వారా ఒకే వేదిక మీద కలుసుకోవడం తనకు మరింత సంతోషం కలిగించిందన్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు తమ చిన్నారులను మన సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష, నృత్యాలను నేర్పించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండం ముదావహం అన్నారు. వీటిని అత్యంత అభిమానంతో అభ్యసిస్తున్న ప్రవాసాంధ్ర చిన్నారులకు తన అభినందనలు తెలిపారు. ప్రవాసాంధ్రులు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా తనను కలుసుకోవాలని శ్రీనివాస రావు ఆహ్వానించారు. అక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు, సమాచారం అవసరమైనా తాను సంతోషంగా చేస్తానని హామీ ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 14 July, 2009
|