'విశ్వాసానికి ప్రతీక వైఎస్'
డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 60 వ జన్మదినోత్సాన్ని డల్లాస్ లో ప్రవాసాంధ్రులు వైభవంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం స్థానిక పసంద్ రేస్టారెంట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అజయ్ రెడ్డి, గోపీరెడ్డి చిల్లకూరు, రమణారెడ్డి క్రిస్టపాటి ఆధ్వర్యంలో వైఎస్ అభిమానులు ఆయన జన్మదినోత్సవాన్ని ఆహ్లాదరకర వాతావరణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవాస కాంగ్రెస్ నాయకుడు గోపీరెడ్డి మాట్లాడుతూ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్న విషయం, ఆ సందర్భంగా జరిగిన పలు సంఘటనలను స్పష్టంగా వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాష్ట్ర ప్రజలకు ఉన్న ఎనలేని అభిమానాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి తల్లి వైఎస్సార్ ను తన పెద్దకొడుకు గాను, ప్రతి చెల్లి పెద్దన్నగా అభిమానిస్తున్నారని, అందుకే ఆయనకు ఘన విజయం చేకూర్చి పెట్టారన్నారు.
అపర భగీరథుడు, జలయజ్ఞ ప్రదాత రాజన్నకు ఓటు వేయకపోతే నమ్మక ద్రోహమే అవుతుందని రైతులంతా తలిచారని అందుకే ఆయనకు బ్రహ్మరథం పట్టారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరెన్నో ఇలాంటి పుట్టిన రోజులు ఘనంగా జరుపుకొని రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని గోపీరెడ్డి ఆకాంక్షించారు.
అజయ్ రెడ్డి మాట్లాడుతూ, నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిక వైఎస్ రాజశేఖరరెడ్డి అని అభివర్ణించారు. అందుకే వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టారని అన్నారు.
Pages: 1 -2- News Posted: 15 July, 2009
|