న్యూయార్క్ లో వైఎస్ బర్త్ డే
న్యూయార్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 60వ జన్మదినోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐనాక్) ఆధ్వర్యంలో న్యూయార్క్ లో ఘనంగా నిర్వహించారు. సుమారు వంద మంది ప్రవాసాంధ్ర కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎ.పి. ఐనాక్ అధ్యక్షుడు మహేష్ సలాది ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు సేవ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని, మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఎ.పి. ఐనాక్ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ మాండవ నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని కోరుకున్నారు. ఎ.పి. ఐనాక్ వ్యవస్థాపక మాజీ అధ్యక్షుడు డాక్టర్ గడ్డం దశరథరాంరెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరా గృహ పథకం, మహిళలకు రుణాలు, పావలా వడ్డీ పథకం, వృద్ధాప్యపు పెన్షన్ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి అని చెప్పారు.
రాజేశ్వరరెడ్డి గంగసాని మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు అని చెప్పారు. సుధీర్ రావు భాష్యం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఓడినా నేనే భాధ్యుడ్ని అని చెప్పడం, వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసానికి నిదర్శనం అని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 15 July, 2009
|