'బతుకమ్మ' ఏర్పాట్లు షురూ
డల్లాస్\ ఫోర్ట్ వర్త్ : సెప్టెంబర్ 26 శనివారం నాడు 2009 బతుకమ్మ పండుగ, దసరా సంబరాలు నిర్వహించాలని డల్లాస్\ ఫోర్ట్ వర్త్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. జూలై 19న ఇర్వింగ్ లోని స్పైస్ ఇన్ రెస్టారెంట్ లో ఈ ఉత్సవాల ఏర్పాట్లకు అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది బతుకమ్మ\ దసరా ఉత్సవాల నిర్వహణకు ప్లానోలోని ఓక్ పాయింట్ సెంటర్ ఉన్న ఆంఫి థియేటర్ ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఉత్సవాల ఏర్పాట్ల ప్రారంభ కార్యక్రమానికి స్థానికంగా ఉంటున్న పలు తెలుగు సంస్థలు \ విభాగాల నుంచి ఏభై మందికి పైగా హాజరయ్యారు. 2009 ఉత్సవాల నిర్వహణ కోసం ప్రారంభ కార్యక్రమంలోనే ఐదు వేల డాలర్లు విరాళంగా సమకూరాయి. డిస్కవర్ ట్రావెల్ యజమాని రామ్ యలమంచిలి ఉత్సవాలకు మెగా స్పాన్సర్ గా, హాట్ బ్రీడ్స్ హొటల్ యజమాని సూర్యా నాయుడు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రకటించారు.
అనంత్ రెడ్డి పజ్జూ స్వాగతం పలకగా, చంద్ర బండార్ ప్రార్థనాగీతంతో సమావేశం ప్రారంభమైంది. గత సంవత్సరం బతుకమ్మ\ దసరా సంబరాలు విజయవంతంగా నిర్వహించిన విశేషాలను టూకీగా వివరించారు. సమావేశానికి హాజరైన అందరి హర్షాతిరేకాల మధ్య సతీష్ రెడ్డి, జానకి మందాడి 2009 బతుకమ్మ\ దసరా ఉత్సవాల వేదిక, తేదీలను ప్రకటించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో పాలు పంచుకునే వివిధ కమిటీలు, అవి నిర్వహించాల్సిన బాధ్యతలను జానకి మందాడి వివరించారు. ఈ సంబరాలను విజయవంతం చేసేందుకు వివిధ తెలుగు సంఘాలు, వాటి నిర్వాహకులు ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారో కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం బతుకమ్మ\ దసరా ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను సమావేశానికి హాజరైన పలువురు అందజేశారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఆహూతులకు ధన్యవాదాలు చెప్పడం, ప్రార్థనా గీతంతో 2009 బతుకమ్మ \ దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Pages: 1 -2- News Posted: 23 July, 2009
|