మైమరపించిన కీరవాణి
న్యూజెర్సీ : మెగా సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే ఉండదు. జూలై 25 శనివారం న్యూజెర్సీలో కీరవాణి తన బృందంతో కలిసి నిర్వహించిన మధురమైన సంగీత విభావరి ఆహూతులందరినీ మైమరపించి, మురిపించింది. చిన్నా పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా విభావరికి హాజరైన ప్రతి ఒక్కరినీ ఆనందార్ణవంలో ముంచి కట్టిపడేసింది. కీరవాణి భారతదేశం బయట నిర్వహించిన సంగీత విభావరుల్లో న్యూజెర్సీ ప్రోగ్రాం అత్యంత విజయవంతంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. యూనియన్ కౌంటీ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్ (యుసిపిఎసి) సంగీత ప్రియులతో కిక్కిరిసిపోయింది. 14 వందల మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సుకత, ఉత్సాహంతో హాజరయ్యారు. ఇంత హృదయానందకరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టాలీ టు హాలీ, ఫార్మాకేర్, బెల్ ఎయిర్, ఎండి సంస్థలను ఆహూతుందరూ అభినందనలతో ముంచెత్తారు.తన వాచికాభినయాలతో ప్రేక్షకులను సమయస్ఫూర్తితో, చూడగానే ఆకట్టుకునే టివి యాంకర్ ఉదయభాను ఈ కార్యక్రమాన్ని నడిపించి అందరి హృదయాలనూ చూరగొన్నారు.
డెలవేర్ కు చెందిన చిన్నారులు బేబీ నిఖిల, ఆర్తి ఆలపించిన 'శుక్లాంబరధరం' శ్లోకంతో కీరవారణి సంగీత విభావరి కార్యక్రమం ప్రారంభమైంది. అతిథులందరికీ నిఖిల, ఆర్తి, వంశిక, అనుష్క, హర్షిత, అపూర్వ కర్ణ, భవ్యశ్రీ కర్ణ పూలమాలలు వేశారు. అతి కొద్ది సమయంలో అందరినీ ఆకట్టుకునే కీరవాణి సంగీత విభావరిని ఏర్పాటు చేసిన రవివర్మ ముదునూరిని టాలీ టు హాలీ యజమాని గణేశ్ ఇందుకూరి వేదిక మీదకి ఆహ్వానించి అభినందించారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో ప్రైమరీ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధుల సమీకరించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన ప్రస్తావించారు. ప్రవాసాంధ్రులను అలరించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.
పొన్నెకల్లులో ప్రైమరీ కేర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఫార్మాకేర్ సంస్థకు చెందిన విజయ్ రెడ్డి వివరించారు. ప్రైమరీ కేర్ సెంటర్ ఏర్పాటు గురించి తాను చెప్పిన వెనువెంటనే సహాయ సహకారాలు అందించేందుకు ఉదారంగా ముందుకు వచ్చిన సుబ్బరాజు ఇందుకూరికి విజయ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ సంస్థ హెల్ప్ లైన్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్న విజయ్ రెడ్డి నాట్స్ గురించి, తాము అందిస్తున్న సేవల గురించి క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా నాట్స్ సంస్థ ప్రెసిడెంట్ రవి మాదల హెల్ప్ లైన్ 888-4-TELUGU ను లాంఛనంగా ప్రారంభించారు. హెల్ప్ లైన్ ఏ విధమైన సేవలు అందజేసేదీ వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 28 July, 2009
|