'ఏక్ షామ్ సాయి కే నామ్' హాంప్ షైర్ : 'ఏక్ షామ్ శ్రీ సాయి కే నామ్' పేరు మీద షికాగోలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో సాయి ఆలయం పంచమ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అజయ్ గంటి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 30వ తేదీ ఆదివారం నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రసిద్ధి సాయి భక్తుడు సి.బి. శత్పథి, ప్రముఖ నేపథ్య గాయకుడు, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు సురేష్ వడ్కర్ 'ఏక్ షామ్ శ్రీ సాయి కే నామ్' కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. ఆ రోజు సాయంత్ర 6 గంటల నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. షికాగో నగరానికి వాయవ్య దిశగా ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని హైంప్ షైర్ నగరంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం ఐదవ వార్షికోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అజయ్ పేర్కొన్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా శత్పథి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అలాగే ఆలయం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన 'పారాయణ్ హాలు' (రీడింగ్ రూమ్)ను కూడా ఆయన ప్రారంభిస్తారని అజయ్ వివరించారు. ఆ వెనువెంటనే శత్పథి ఆధ్యాత్మికోపన్యాసం చేస్తారు. అనంతరం సురేష్ వడ్కర్ తన మధుర కంఠంతో షిరిడీ సాయిబాబా భక్తి గీతాలు, ఇతర భక్తిగేయాలు ఆలపించి భక్తులందరినీ ఆధ్యాత్మికానందంలో ఓలలాడిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే సి.బి. శత్పథి రచించి, సంగీతం సమకూర్చిన 'తుభ్యం నమామి సాయినాథాయ' శీర్షిక గల సాయి మంత్రం ఆడియో ఆల్బమ్ ను విడుదల చేస్తారు. సాయి మంత్రానికి సురేష్ వడ్కర్, తదితరులు తమ గాత్రాన్ని అందించారు.
Pages: 1 -2- News Posted: 14 August, 2009
|