హిందూ చైతన్య పాదయాత్ర టెక్సాస్ : గ్రేటర్ హైదరాబాద్ హిందువుల్లో చైతన్యం కలిగించే దిశగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 130 రోజుల పాటు మహా పాదయాత్ర - 3 నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ప్రకాశరావు వెలగపూడి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 1500 కిలోమీటర్లు కొనసాగే ఈ మహా పాదయాత్రను పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నరసింహ భారతి స్వామి, జగన్నాథ మఠం నిర్వాహకుడు శ్రీ శ్రీనివాస రామానుజ జీయర్ స్వామీజీ ఆశీస్సులతో ప్రారంభిస్తారని ఆయన వివరించారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంగాళి ఆలయం నుంచి సెప్టెంబర్ 20న ఈ మహా పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ఆలయాలు, ధర్మసంస్థలు, గోశాలలు, సేవాశ్రమాలు, మఠాలను సందర్శిస్తుందన్నారు. భక్త మండళ్ళు, భజన మండళ్ళు, ధార్మిక యువజన ఆర్గనైజేషన్లను ఈ మహా పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
హిందూ ధర్మం, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు పట్ల గౌరవం కలిగించడం, హిందువుల్లో ఐకమత్యాన్ని నెలకొల్పాలన్న సందేశాన్ని ఈ మహా పాదయాత్ర సందర్భంగా ప్రచారం చేయనున్నట్లు ప్రకాశరావు వెలగపూడి వెల్లడించారు. అలాగే , భవిష్యత్ తరాలకు ఆలయ సంస్కృతిని భద్రంగా అందించేందుకు పరిరక్షించడం లాంటి అంశాలను ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడుం కట్టిన తమకు ఈ మహా పాదయాత్రలో విశేష సంఖ్యలో పాల్గొనడం ద్వారా ప్రోత్సాహం, మద్దతు ఇవ్వాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రకాశరావు వెలగపూడి పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్ర గురించి ప్రతి ఒక్కరూ తాము నివాసం ఉంటున్న కాలనీలు, స్థానిక దేవాలయాల్లో ప్రచారం చేయాలని కోరారు. ఆయా కాలనీలకు హిందూ మహా పాదయాత్ర వచ్చినప్పుడు అక్కడి వారు కూడా పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన తమ తమ కాలనీలు, నివాస ప్రాంతాల్లో ఆలయాల్లోని సమస్యలపై స్వామీజీతో చర్చించి, సహాయం పొందే అవకాశం కలుగుతుందన్నారు. తమ సంస్థ నుంచి ప్రచార పత్రాలు తీసుకొని తమ తమ కాలనీల్లో పంచిపెట్టాలని కోరారు. స్వామీజీకి ఒక రోజు పాటు మధ్యాహ్నం, రాత్రి ప్రసాదాన్ని, వసతిని కల్పించడం ద్వారా ఈ మహా పాదయాత్రకు సాయం చేయవచ్చన్నారు. ఈ మహా పాదయాత్రకు సంబంధించిన తమ తమ కాలనీల్లో కట్టేందుకు బ్యానర్లను సమకూర్చడం ద్వారా మంచి కార్యక్రమానికి చేయూతనివ్వవచ్చని ప్రకాశరావు వెలగపూడి వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 11 September, 2009
|