నవ్వుల రారాజుకు నివాళి

న్యూజెర్సీ : నవ్వుల రారాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి న్యూజెర్సీలో ప్రముఖ ప్రవాసాంధ్రులు, ప్రసిద్ధ తెలుగు సంస్థలు అశ్రు నివాళులు అర్పించారు. వైఎస్సార్ గా అందరికీ తెలిసిన యెదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి ప్రస్తుత రాజకీయ యవనికపై మెరిసిన అభిమాన ధ్రువతార అని ప్రవాసాంధ్రులు ప్రస్తుతించారు. ఈ నెల 2వ తేదీన కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని పావురాలగుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన విషయం తెలిసిందే. ఎందరో అభిమానాన్ని ముటగట్టుకున్న వైఎస్ ఇలా అకాల మరణం చెందడంతో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), టిఎఫ్ఎఎస్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), టిఎల్ సిఎ తదితర తెలుగు సంస్థల ఆధ్వర్యంలో 12వ తేదీ శనివారంనాడు వైఎస్సార్ 'సంస్మరణ సభ' జరిగింది. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది అభిమానులు, ప్రవాసాంధ్రులు ఈ సంస్మరణ సభలో పాల్గొని తమ అభిమాన నాయకునికి నివాళులు అర్పించారు.
ఈ సంస్మరణ సభకు హాజరైన వారిని ఆటా నాయకుడు మహేందర్ ముసుకు స్వాగతం పలికారు. దివంగత వైఎస్సార్ జీవితంలోనూ, మరణంలోనూ చాంపియన్ రాజకీయవేత్త అని మహేందర్ కొనియాడారు. పేదలు, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఆయన రూపొందించి ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టులను పూర్తి చేయడమే వైఎస్సార్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
సర్వ మత ప్రార్థనలు : ఈ సంస్మరణ సభలో వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. బ్రదర్ ఫణి జోషువా, హిందూమత గురువు బాలకృష్ణ ఈ ప్రార్థనలు నిర్వహించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్సార్ తదితరుల కోసం జోషువా బైబిల్ నుంచి పలు వాక్యాలను వినిపించారు. ప్రార్థనలు చేశారు. వైఎస్సార్, తదితరుల ఆత్మకు శాంతి చేకూరాలని హిందూ మత గురువు బాలకృష్ణ శాంతి ప్రార్థనలు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు గల అనుబంధాన్ని కాంగ్రెస్ మ్యాన్ ఉపేంద్ర చివుకుల గుర్తుచేసుకున్నారు. తాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వైఎస్సార్ నివాసంలో తనను ఆదరించిన వైనాన్ని నెమరు వేసుకున్నారు. అంతటి మహా నాయకుడిని అకస్మాత్తుగా కోల్పోయిన వైఎస్సార్ కుటుంబ సభ్యులు, భారత ప్రజలకు ఉపేంద్ర తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. వైఎస్సార్ మృతికి నాట్స్ డైరెక్టర్ విజయ్ రెడ్డి సంతాపం ప్రకటిస్తూ, తెలుగువారందరికీ ఇది ఒక దుఃఖ సమయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ వైఎస్సారి చిరస్థాయిగా నిలిచే ఉంటారన్నారు. వైఎస్సార్ వదిలిపెట్టిన లక్ష్యాలను ఆయన వారసునిగా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయగలరన్న ఆశాభావాన్ని విజయ్ రెడ్డి వ్యక్తం చేశారు.
అమెరికాలోని ప్రవాస ఆంధ్రప్రదేశ్ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ (ఎపి ఐనాక్) అధ్యక్షుడు మహేష్ సలాది మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చరిత్రను చదువుతారు కాని వైఎస్సార్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారని కొనియాడారు. వైఎస్సార్ లేని కాంగ్రెస్ పార్టీని తాను ఊహించలేకపోతున్నానని మహేష్ సలాది ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మృతికి ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. దివంగత మహానేత వైఎస్సార్ తో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయం గురించి ఆటాకు చెందిన విజయ్ సంతాప సభలో స్ఫురణకు తెచ్చుకున్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ తనయుడు, కడప ఎంపి జగన్మోహన్ రెడ్డిని తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు.
Pages: 1 -2- News Posted: 15 September, 2009
|