'మహా నాయకుడు వైఎస్'

నోరిస్ టౌన్ (ఫిలడెల్ఫియా) : ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం అహరహం శ్రమించి, తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జనహృదయాల్లో మహా నాయకుడిగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని చటావ్ గ్రానియరి ప్రెసిడెంట్ మరూరి వెంకటేశ్వర రెడ్డి అభివర్ణించారు. జలయజ్ఞం, 108, 104 హెల్ప్ లైన్ లాంటి పథకాలను రూపొందించి, విజయవంతంగా అమలుచేసిన వైఎస్ భవిష్యత్ తరాలకు, రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శిగా నిలిచారని ప్రశంసించారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పెన్సిల్వేనియాలోని నోరిస్ టౌన్ 'చటావ్ గ్రానియరి'లో సెప్టెంబర్ 13 ఆదివారం నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణ సభకు ఫిలడెల్ఫియా రీజియన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. విచారకరమైన సమావేశమే అయినప్పటికీ తరలివచ్చిన అందరినీ వెంకటేశ్వరరెడ్డి స్వాగతించి, ప్రసంగించారు.
కార్పొరేట్ ఆస్పత్రుల గుమ్మం కూడ తొక్కే అవకాశం లేని సామాన్య, నిరుపేదలకు మొండిరోగం సంక్రమించినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలుచేసిన ఆరోగ్యశ్రీ పథకం ఎలా ప్రయోజనకారి అవుతున్నదో తన స్వీయ అనుభవాన్ని డాక్టర్ రాఘవరెడ్డి సభికులతో పంచుకున్నారు. నిరుపేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం వైఎస్సార్ పడిన తపన, చేసిన కృషి గురించి ఆయన నెమరు వేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలను ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళేందుకు వైఎస్సార్ తన జీవితాన్ని, సమయాన్ని అంకితం చేసిన విధానం గురించి గంగసాని రాజేశ్వర్ రెడ్డి తన స్వీయ అనుభవాన్ని వివరించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన అన్ని ఆర్థిక పథకాల ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలు లబ్ధి పొందుతున్న విషయాన్ని పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 17 September, 2009
|