మేరీ పాలెంటీ సంతాపం

డల్లాస్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి మిన్నెసొట గవర్నర్ సతీమణి, రాష్ట్ర ప్రథమ మహిళ మేరీ పాలెంటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మహిళలు, చిన్నారుల్లో వచ్చే గుండెజబ్బులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు మేరీ పాలెంటీ తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్ సి) ఈ నెల 13న నిర్వహించిన సంతాప సభలో ఆమె జ్యోతి వెలిగించి, వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఆమె తన సానుభూతిని తెలిపారు. డల్లాస్ లోని స్పైస్ ఇన్ రెస్టారెంట్ లో ఈ సంతాప సభ నిర్వహించారు. మేరీ పాలెంటీ హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులను సందర్శించి ఇటీవలే తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆమె ఎందరో వైద్యులతోను, అధికారులతోను, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోను సమావేశమై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మేరీ పాలెంటీ వైఎస్ తో తన సమావేశం గురించి, ఆయన తన పట్ల కనబరిచిన ఆదరాభిమానాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ లోని మంచి నాయకత్వ లక్షణాల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్న దూరదృష్టి గురించి ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనబరిచిన ఆదరాభిమానలు, స్వాగతించిన తీరు పట్ల ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. భారతీయ సంస్కృతి మేరీ పాలెంట్ పై ఎంతగా ప్రభావం చూపిందో ఆమె చెప్పకుండానే చెప్పారు. వైఎస్ సంతాప సభకు మేరీ సిల్కు చీర ధరించి పూర్తిగా భారతీయ మహిళలా తయారై రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిన్నారుల్లో తలెత్తుతున్న హృదయ సంబంధ వ్యాధుల పట్ల అందరిలో అవగాహన కల్పించేందుకు ప్రవాసాంధ్రులంతా ముందుకు రావాలని ఈ సందర్భంగా పాలెంట్ పిలుపునిచ్చారు.
Pages: 1 -2- News Posted: 17 September, 2009
|