గుండె తడిపిన 'గోరటి'

డెట్రాయిట్ : ప్రసిద్ధ తెలంగాణ జానపద గేయకారుడు గోరటి వెంకన్న పాడిన 'పాట పాడేటి పిల్లలు', 'పల్లె కన్నీరు' గేయాలు అందరి హృదయాలనూ ద్రవింపచేశాయి. ప్రతి ఒక్కరి కంట ఆయన గేయాలు కన్నీరు పెట్టించాయి. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం మిషిగన్ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్ హిల్స్ లో సెప్టెంబర్ 19న నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో గోరటి వెంకన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో వరుసగా నాలుగో సంవత్సరం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది భక్తులు బతుకమ్మ పండుగకు సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన బతుకమ్మ సంబరాలు ఆద్యంతమూ అందరినీ ఎంతగానో అలరించాయి. డెట్రాయిట్ మెట్రో ప్రాంతం నుంచే కాకుండా లాన్సింగ్, జాక్సన్, పెన్సిల్వేనియా, కెనడా, భారతదేశం నుంచి అమెరికా పర్యటనకు వచ్చిన తల్లిదండ్రులు కూడా ఈ సంబరాల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.
ఈ పండుగ సందర్భంగా కనువిందు చేసే విధంగా 3.7 అడుగుల ఎత్తైన బతుకమ్మను పేర్చిన శ్రీమతి వసంత చల్లా ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. 3.5 అడుగుల ఎత్తున గౌరీ ముఖంతో బతుకమ్మను రూపొందించిన అనిత బొమ్మనవేని ద్వితీయ బహుమతిని, 3 అడుగుల ఎత్తులో రంగురంగులతో బతుకమ్మను పేర్చిన శోభ తూముకుంట తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. రజిత, విజయ, గీత ఏర్పాటు చేసిన బతుకమ్మలకు కన్సొలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మేజర్ స్పాన్సర్లుగా వ్యవహరించిన వారికి బహుమతులను ముఖ్య అతిథి గోరటి వెంకన్న చేతుల మీదుగా నిర్వాహకులు అందజేశారు.
Pages: 1 -2- News Posted: 22 September, 2009
|