టిసిఎ బతుకమ్మకు ప్రశంసలు

కాలిఫోర్నియా : తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టిసిఎ) నిర్వహించిన బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రవాసులు, తెలంగాణేతర ప్రవాసాంధ్రులు, అమెరికా, చైనా దేశాలకు చెందిన పలువురి నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాలిఫోర్నియా రాష్ట్రం సన్నివేల్ నగరంలోని ఓర్టెగా పార్క్ లో ఈ నెల 20న మధ్యాహ్నం బతుకమ్మ పండుగను టిసిఎ వైభవంగా నిర్వహించింది. ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆట పాటలతో ఆహ్లాదంగా కొనసాగిన బతుకమ్మ పండుకు కుల మతాలు, ప్రాంతీయ భేదాలు, దేశాల అంతరాలు లేకుండా భారీ సంఖ్యలో భక్తులు, అతిథులు హాజరయ్యారు. టిసిఎ బతుకమ్మ పండుగలో సన్నివేల్ నగర మేయర్ టోనీ స్పిటలెరి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా టిసిఎ సన్మానిస్తూ అందజేసిన శాలువను త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్ళీ తాను మేయర్ గా ఎన్నికైతే నవంబర్ 3న నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవంలో ఇదే శాలువను తన భుజాలపై కప్పుకుంటానని టోనీ స్పిటలెరీ పేర్కొనడం విశేషం.
టిసిఎ ప్రెసిడెంట్ బిక్షం పాలబిందెల స్వాగతోపన్యాసంతో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. టిసిఎ లక్ష్యాల గురించి వివరించారు. బతుకమ్మ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలపై గత కొద్ది రోజులుగా తాము నిర్వహించిన శిక్షణ శిబిరానికి హాజరైన చిన్నారులు, మహిళలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. బతుకమ్మ పండుగ విశేషాల గురించి టిసిఎ చైర్మన్ విజయ్ చవ్వ వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సీరా అట్లాంటిక్ సంస్థ సిఇఓ రాజు రెడ్డిని సన్మానించారు.

ముఖ్య అతిథి, సన్నివేల్ మేయర్ టోనీ స్పిటలెరీ మాట్లాడుతూ, వైవిధ్య భరితంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానన్నారు. టిసిఎ బహూకరించిన శాలువను ఇంటికి తీసుకువెళ్ళి, వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తాను మేయర్ గా ఎన్నికైతే దాన్ని ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భుజాలపై కప్పుకుంటాని ప్రకటించారు. ప్రత్యేక అతిథి రాజు రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కోసం టిసిఎ భారీ స్థాయిలో చేసిన ఏర్పాట్ల పట్ల సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఇంత ఉన్నతమైన సంప్రదాయ ఉత్సవంలో భాగస్వామి అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలకు హాజరు కాలేకపోయినప్పటికీ భవిష్యత్తులో తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. నిజామాబాద్ లో తన చిన్ననాట జరిగిన బతుకమ్మ ఉత్సవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
Pages: 1 -2- News Posted: 23 September, 2009
|