'తేన' బతుకమ్మ పండుగ

ఫిలడెల్ఫియా : తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తేన) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మూడవ సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. కింగ్ ఆఫ్ ప్రస్యా సమీపంలోని విల్సన్ ఫార్మ్ పార్క్ లో సెప్టెంబర్ 26న బతుకమ్మ పండుగను తేన వైభవంగా నిర్వహించింది. విల్సన్ ఫార్మ్ పార్క్ లోను, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు తెలంగాణ పల్లెలను పోలి ఉడడం ఫిలడెల్ఫియా బతుకమ్మ సంబరాలకు మరింత శోభను చేకూర్చిపెట్టాయి. ఫిలడెల్ఫియా, పరిసర ప్రాంతాల నుంచి సుమారు వంద మంది భక్తులు బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. మహిళలు రంగు రంగులతో కూడిన సాంప్రదాయ దుస్తులు ధరించి, అందంగా, ఆకర్షణీయంగా బతుకమ్మలను కూర్చి సంబరాలకు మరింత నిండుదనాన్ని తీసుకువచ్చారు. ఈ సంబరాల్లో కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్నారైలే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఎంతో ఆనందంగా పాల్గొనడం విశేషం.
బతుకమ్మ సంబరాలు జరిగే విల్సన్ ఫార్మ్ పార్క్ కు కుటుంబాలు రావడం ప్రారంభం కాగానే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సంగీతం, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలకు తేన నిర్వాహకులు తెరతీశారు. బతుకమ్మ పండుగలో పాల్గొనేందుకు వచ్చిన వారి పరిచయ కార్యక్రమంలో సంబరాలు మొదలయ్యాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారు తీసుకువచ్చిన రకరకాల సద్దులు, బియ్యంతో తయారు చేసిన ఐదు రకాల పదార్థాలు, తెలంగాణ రుచులతో అందరూ ఆనందంగా మధ్యాహ్న భోజనం పూర్తి చేశారు.
ఈ సంబరాల్లో భాగంగా 10 నుంచి 15 వరకూ అందంగా, ఆకర్షణీయంగా అలంకరించిన బతుకమ్మలను భక్తులు తీసుకువచ్చారు. సాంప్రదాయబద్ధంగా గౌరీపూజతో బతుకమ్మ పండుగను ప్రారంభించారు. అనంతరం మహిళలంతా బతుకమ్మలను పార్కులో ఒకచోట ఉంచి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాట 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో' పాడుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడారు. నిజానికి రంగురంగుల చీరలు, దుస్తులు ధరించిన మహిళలు, చిన్నారులు బతుకమ్మను ఆడడం చూసిన వారికి కనువిందు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని సముద్రపు కయ్యలో నిమజ్జనం చేశారు.
Pages: 1 -2- News Posted: 30 September, 2009
|