'ప్రవాసాంధ్రులూ శెభాష్'

డల్లాస్ : అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని భారత కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అభినందించారు. తెలుగువారి చరిత్ర, సంస్కృతులకు ఉన్న ప్రాశస్త్యాన్ని గురించి ఆమె సవివరంగా ప్రస్తావించారు. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు యువతకు మన సంస్కృతిని సుపరిచయం చేసే క్రమంలో తల్లిదండ్రులంతా ఇంటిలో తమ పిల్లలతో తెలుగులోనే సంభాషించాలని ఆమె సూచించారు. భారత, అమెరికా దేశాల్లో చోటుచేసుకుంటున్న గృహహింస గురించి పురందేశ్వరి ప్రస్తావిస్తూ, దాని నిర్మూలన కోసం దేశాల మధ్య చక్కని సమన్వయం సాధించేందుకు ఒక సపోర్ట్ గ్రూపును ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. అమెరికా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పురందేశ్వరి, సౌత్ లేక్ మేయర్ జాన్ టెర్రిల్ గౌరవార్ధం డాక్టర్ శ్రీలతారెడ్డి\ గుర్రం శ్రీనివాసరెడ్డి, వారి కుటుంబ మిత్రులు కలిసి టెక్సాస్ లోని సౌత్ లేక్ లో ఉన్న తమ నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పలువురు వ్యాపారదక్షులు కూడా పాల్గొన్నారు.
ఈ విందు సమావేశానికి హాజరైన వారికి అతిథులు పురందేశ్వరి, సౌత్ లేక్ మేయర్, డల్లాస్ ఫోర్ట్ వర్త్ విమానాశ్రయం వ్యాపారాభివృద్ధి గ్రూపు వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్రిల్ లను గుర్రం శ్రీనివాసరెడ్డి పరియం చేశారు. ఈ సందర్భంగా టెర్రిల్ మాట్లాడుతూ, సౌత్ లేక్ నగర పర్యటనకు వచ్చిన పురందేశ్వరిని అభినందనలతో ముంచెత్తారు. తన సొంతగడ్డ సౌత్ లేక్ నగరంలో పురందేశ్వరి పాల్గొన్న ఈ అల్పాహార విందు సమావేశంలో తాను పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. అమెరికాలో నివసించే వారికి సౌత్ లేక్ నగరం అత్యంత అనుకూలమైనదని ఏజెన్సీలు, మ్యాగజైన్లు నిర్వహించిన పలు సర్వేల్లో తేటతెల్లమైందన్నారు. అలాగే టెక్సాస్ రాష్ట్రంలోనే సౌత్ లేక్ లోని విద్యాసంస్థలు అత్యున్నత విద్యా ప్రమాణాలతో విలసిల్లుతున్నాయన్నారు. భారతీయ విమానాశ్రయాలతోను, విమానాయ సంస్థలతోనూ తాను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మంచి సంబంధాలు నెలకొనేలా కృషిచేస్తానన్నారు. భారతదేశంలో పర్యటించాలన్న పురందేశ్వరి ఆహ్వానం పట్ల ఆయన మహదానందం వ్యక్తం చేస్తూ, భారతదేశంలో త్వరగా పర్యటించి, డల్లాస్ - భారత దేశాల మధ్య త్వరగా వ్యాపార సంబంధాలు అభివృద్ధి చేయాలన్న ఉత్సుకత తనలో పెరుగుతోందన్నారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|