డల్లాస్ లో బతుకమ్మ సందడి

డల్లాస్ : అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలను డల్లాస్ లో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. 'డల్లాస్ ఫోర్ట్ వర్త్ బతుకమ్మ & దసరా సంబరాలు' పేరిట తానా - టాన్ టెక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 3,500 మందికి పైగా ఉత్సాహవంతులు పాల్గొన్నారు. ఆరు గంటలకు పైగా ఉల్లాసంగా జరిగిన ఈ సమ్మిళిత సంబరాల్లో భారత కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరయ్యారు. జానపద రచయిత, గేయకారుడు గోరటి వెంకన్న సాంస్కృతిక కార్యక్రమాల అతిథిగా పాల్గొన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో బతుకమ్మ సంబరాలు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యాయి. వందలాది మంది మహిళలు సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ ఆట పాటల్లో ఆనందంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో సంబరాల వేదిక మారుమోగిపోయింది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, తెలంగాణ సాంప్రదాయ ఉత్సవాలను అమెరికాలోనూ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరంను అభినందించారు. బతుకమ్మ సంబరాల ముగింపుగా మహిళలు తాము తీసుకువచ్చిన బతుకమ్మలను పార్క్ వెనుక ఉన్న సెలయేరులో నిమజ్జనం చేశారు. అనంతరం వారంతా గౌరీ పూజ నిర్వహించారు.
Pages: 1 -2- News Posted: 10 October, 2009
|