హాంకాంగ్ లో దసరా సరదా

హాంకాంగ్ : హాంకాంగ్ లో స్థిరపడిన తెలుగువారు అత్యంత భక్తి శ్రద్థలతో, ఉత్సాహంగా నిర్వహించుకొనే పండుగల్లో విజయదశమి (దసరా) ఒకటి. ఈ దసరా సంబరాలంటే ప్రధానంగా మహిళలు, చిన్నారులు ప్రత్యేకంగా బాలికలు ఎనలేని ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. హాంకాంగ్ లోను, చుట్టుపక్కల ఎక్కడెక్కడో నివాసం ఉంటున్న తెలుగువారంతా దసరా సంబరాల్లోనే ఒక్కచోట కలిసి ఆనందంగా గడపడం ఆనవాయితీగా వస్తోంది.
దసరా సంబరాల సన్నాహాలు జూలై - ఆగస్టు మాసాల మధ్య ప్రారంభం అవుతాయి. దసరా నవరాత్రుల పూజ కోసం అవసరమయ్యే పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలతో పాటు ఇష్టమైన వారికి అందజేసే బహుమతులను కొంటారు. వీటన్నింటి కంటే అతి ప్రధానంగా బంగారు ఆభరణాలు, చీరలను ఖరీదు చేస్తారు.
దసరా నవరాత్రుల తొలి రోజు నుంచీ ఉదయం 7 గంటలకు లలితా సహస్ర నామావళి పారాయణ, ఆ వెంటనే ప్రసాద వితరణ, ఇడ్లీ - సాంబారు, గారెలు - పచ్చడి, ఉప్మా, పులిహోర, దద్ధోజనం, పాయసం లాంటి సాంప్రదాయ రుచులతో అందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తారు. దసరా నవరాత్రుల పది రోజులూ హాంకాంగ్ లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాలు కనువిందుగా మారిపోతాయి. సర్వత్రా ఆనందం, సోదరబావం నిండి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 10 October, 2009
|