వైట్ హౌస్ లో దీపావళి

వాషింగ్టన్ : భారతీయుల అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకొనే దీపావళి వేడుకలు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో సాంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్ లో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ వేడుకలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపం వెలిగించి ప్రారంభించారు. అనంతరం భారతీయులందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి ఈ భారతీయ పండుగను జార్జి డబ్ల్యు బుష్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 2003లోనే శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు తొలిసారిగా ప్రారంభమయ్యాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు స్వయంగా దీపావళి వేడుకల్లో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. ఆ ఘనత కూడా తొలి నల్లజాతి అమెరికా అధ్యక్షుడు ఒబామాకే దక్కింది. శ్వేతసౌధం ఈస్ట్ రూమ్ లో సిద్ధం చేసి ఉంచిన దీపాన్ని ఒబామా స్వయంగా వెలిగించి ఈ వేడుకలను ప్రారంభించడం విశేషం. 'మనందరం ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాల్సిన సమయం ఇది' అంటూ ఈ సందర్భంగా బుష్ తన సందేశాన్నిచ్చారు.
వాషింగ్టన్ లోని శివ - విష్ణు ఆలయంలోని పూజారిగా ఉన్న ఆంధ్ర పూజారి నారాయణాచారి వైట్ హౌస్ దీపావళి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారత వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ, అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్ సహా ఆసియా, అమెరికా, భారతదేశాలకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైట్ హౌస్ లో దీపావళి వేడుకల ప్రారంభ కార్యక్రమం సుమారు అరగంట పాటు నిర్వహించారు.'చీకటిపై వెలుగుల విజయా'నికి, చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా భావించే దీపావళి వేడుకలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అజ్ఞానంపై విజ్ఞానం విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగను మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 17 శనివారం నాడు భారతదేశంలోను, అమెరికాలో ఉన్న భారతీయులు (హిందువులు, జైనులు, సిక్కులు, కొందరు బౌద్ధులు) దీపాలు వెలిగించి వేడుకగా జరుపుకోనున్నారు.
Pages: 1 -2- News Posted: 15 October, 2009
|