టిఎఫ్ఎఎస్ టెన్నిస్ విజేతలు

న్యూజెర్సీ : తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్) నిర్వహించిన 2009 సంవత్సరపు టెన్నిస్ టోర్నీ విజేతలను ప్రకటించింది. సెప్టెంబర్ 26, అక్టోబర్ 4వ తేదీన ఈ పోటీలను టిఎఫ్ఎఎస్ నిర్వహించింది. రాబిన్స్ విల్లే హైస్కూల్లోనూ, వెస్ట్ విండ్సార్ - ప్లెయిన్స్ బరో హై స్కూల్ సౌత్, వెస్ట్ విండ్సార్ - ప్లెయిన్స్ బరో హై స్కూల్ నార్త్ టెన్నిస్ కోర్టలలో ఈ టోర్నీ నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు దాము గేదెల తెలిపారు.
కొత్త కొత్త సంబంధాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు వంటి సాంఘిక కార్యక్రమాలకు చక్కని వేదిక అయిన టెన్నిస్ టోర్నమెంట్ అంటే తెలుగువారికి తగని మక్కువగా మారిందని, ఇలాంటి టోర్నీలు నిర్వహించడం తమ సంస్థకు ఆనవాయితీగా వస్తోందని దాము గేదల వెల్లడించారు. ఈ ఈవెంట్ లో గత ఏడాది కన్నా అధిక సంఖ్యలో సుమారు 70 మంది ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ మెన్, 50 సంవత్సరాలు పైపడిన పురుషులు, బాలురు, బాలికలు, పదేళ్ళ లోపు చిన్నారులు విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి.
పోటీలు జరిగిన రెండు రోజులూ కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పోటీలకు ముందు రోజులు అత్యంత చలిగా లేదా వర్షంతో కూడి ఉంది. అక్టోబర్ 4న జరిగిన పోటీకి గంట సేపు ముందు వర్షంతో కోర్టు తడి తడిగా ఉండడంతో క్రీడాకారులు శుభ్రపరిచి, పొడిగా పోటీకి అనుకూలంగా చేసుకున్నారు. ఇది వారిలో ఉన్న క్రీడాసక్తిని అందరికీ వెల్లడించింది.
ఈ సంవత్సరపు టోర్నీని విజయ్ సారథి నారా, రామకృష్ణ శీతల నిర్వహించారు. ఈ టోర్నీలో పాల్గొని విజయవంతం చేసిన క్రీడాకారులకు, స్పాన్సర్లకు, కార్యానిర్వాహక కమిటీకి, ఆర్గనైజర్లకు తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ధన్యవాదాలు తెలిపింది. అక్టోబర్ 24న ఈస్ట్ బ్రౌన్స్ విక్ లోని హామర్ జోల్డ్ మిడిల్ స్కూల్ లో జరిగే దీపావళి వేడుకల వేదికపైన విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేయనున్నట్లు టిఎఫ్ఎఎస్ అధ్యక్షుడు దాము గేదెల వెల్లడించారు. పోటీల్లో పాల్గొన్న వారికి కూడా పార్టిసిపెంట్ ట్రోఫీలను అదే వేదికపై అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Pages: 1 -2- News Posted: 15 October, 2009
|