'ఒబిలి'కి ఘన సన్మానం

న్యూజెర్సీ : అమెరికాలోని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్) సేవల్లోను, తెలుగు వారి అభివృద్ధికి ఒబిలి గ్రూప్ చైర్మన్ ఒబిలి రామచంద్రారెడ్డి విశేషంగా తోడ్పాటు అందిస్తున్నారని టిఎఫ్ఎఎస్ ప్రశంసించింది. ముఖ్యంగా టిఎఫ్ఎఎస్ సంస్థ కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి పలువురు ప్రముఖ సినీ కళాకారులను తీసుకురావడంతో రామచంద్రారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని అభినందించింది. హైదరాబాద్ కు చెందిన ఒబిలి రామచంద్రారెడ్డి సేవలకు గుర్తింపుగా ప్రత్యేకంగా అమెరికాకు ఆహ్వానించింది సన్మానించింది. అక్టోబర్ 26న న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న కోరియాండర్ రెస్టారెంట్ లో రామచంద్రారెడ్డిని ఘనంగా సత్కరించింది. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ జరిగిన సన్మానసభలో పలువురు వక్తలు రామచంద్రారెడ్డిని అభినందనలతో ముంచెత్తారు.

ఒబిలి రామచంద్రారెడ్డి సన్మానసభకు హాజరైన అతిథులందరికీ టిఎఫ్ఎఎస్ అధ్యక్షుడు దాము గేదల ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమాన్ని మహేష్ సలాది చక్కని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. అతిథి ఒబిలి రామచంద్రారెడ్డికి సన్మానపత్రాన్ని, శాలువను అందజేసి దాము గేదల సత్కరించారు. టిఎఫ్ఎఎస్ కార్యదర్శి ఆనంద్ పాలూరి మాట్లాడుతూ, అక్టోబర్ 24న తమ సంస్థ నిర్వహించిన దీపావళి వేడుకలను విజయవంతం చేయడంలో వలంటీర్లు క్రమశిక్షణతో కృషిచేశారని ప్రశంసించారు. వలంటీర్లు అందించిన సేవల వల్లే దీపావళి సంబరాలు సంతోషంగా, ఉల్లాసంగా పూర్తయ్యాయని కొనియాడారు. చక్కని సేవలు అందించిన వలంటీర్లకు ఆనంద్ పాలూరి ధన్యవాదాలు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 29 October, 2009
|