మొగుడ్స్-పెళ్ళామ్స్ మురిపాలు

న్యూజెర్సీ : ప్రతి భార్య, ప్రతి భర్తా పెళ్ళయిన కొత్తల్లోని తమ తమ అనుభవాలను ఆనందంగా గుర్తు చేసుకున్నారు. తమ తొలి పరిచయాన్ని, లేదా తొలిసారిగా కలిసి చూసిన సినిమా అనుభవాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్) అక్టోబర్ 24 శనివారం నిర్వహించిన 'మొగుడ్స్ పెళ్ళామ్స్' కార్యక్రమం ఆద్యంతమూ ఆహూతులందరినీ ఎంతగానో అలరించింది. ఈస్ట్ బ్రౌన్స్ విక్ లోని మిడిల్ స్కూల్ లో టిఎఫ్ఎఎస్ ఆ రోజున దీపావళి సంబరాలలో భాగంగా 'మొగుడ్స్ పెళ్ళామ్స్' కార్యక్రమం నిర్వహించింది. మాటీవీలో ఈ కార్యక్రమం ఐదేళ్ళుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, హాస్యనటుడు శివారెడ్డి, మధు ఈ కార్యక్రమాన్ని యాంకర్లుగా ఉత్సాహపూరితంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో 1200 మందికి అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంటల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అక్టోబర్ 11న టిఎఫ్ఎఎస్ నిర్వహించిన ప్రాథమిక ఎంపిక పోటీల్లో అనేక జంటలు పాల్గొన్నాయి. ఆ జంటల్లో నుంచి మంచి ప్రతిభ కనబరిచిన 10 జంటలను తుది పోటీలకు ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షుడు దాము గేదల స్పష్టం చేశారు. ఈ పోటీలో పాల్గొన్న ఒక్కొక్క జంటకు శివారెడ్డి - మధు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రముఖ సినిమా పాటలకు డ్యాన్సులు చేయించారు. మొగుడ్స్ పెళ్ళామ్స్ లైవ్ షోకు మంజు, సంతోష్ ల సహకారంతో గిరిజ కొల్లూరి ఈ కార్యక్రమానికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చడమే కాకుండా కార్యక్రమం విజయవంతం కావడానికి చక్కని సమన్వయాన్ని అందించారు.

మొగుడ్స్ పెళ్ళామ్స్ పోటీల్లో భాగంగా ఇంద్ర సినిమాలోని 'దాయి దాయి దామ్మా' పాటకు చక్కగా డ్యాన్స్ చేసిన వంశీప్రియ - కార్తీక్ దామరాజు జంట విజేతగా నిలిచింది. పోటీలో ఇంకా లతాదేవి - రంగారావు మేడిశెట్టి, మాధురి - శ్రీధర్ గోసుకొండ, సరస్వతి - రాజు చోడపనేటి, తేజస్వి - శ్రీకాంత్ కందుకూరి, కుమార్ - హేమ సదరరమ్, శ్వేతన్ - సుందరి ములకలూరి, కల్యాణ్ - ప్రియ ఆచంట, అనిత - రఘు వీసం హుషారైన పాటలకు జోరుగా స్టెప్పులు వేసి ఆహూతులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం మాటీవిలో ప్రసారం కోసం రికార్డు చేసుకున్నారు.
దీపావళి వేడుకలకు హాజరైన అతిథులందరికీ టిఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ దాము ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన భీకర వరద పరిస్థితి గురించి సంస్థ కార్యదర్శి ఆనంద్ పాలూరి వివరించి, బాధితుల సహాయార్థం విరాళాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఆహూతులు అప్పటికప్పుడు 1500 డాలర్లను విరాళంగా అందజేశారు.
Pages: 1 -2- News Posted: 31 October, 2009
|