'సిద్ధేంద్ర' జన్మదినోత్సవం

హ్యూస్టన్ : సిద్ధేంద్ర యోగి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) అక్టోబర్ నెలలో రెండు 'సాంప్రదాయ కళా కార్యక్రమాలు' నిర్వహించింది. మొదటి కార్యక్రమం అక్టోబర్ 17న స్థానిక మీనాక్షి ఆలయ కల్యాణ మండపంలో వీనుల విందుగా జరిగింది. సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవం వేడుకగా జరిగింది. 'నాట్యకళా రత్న' బిరుదాంకితులు, పద్మభూషణ్ వెంపటి చినసత్యం శిష్యులు పసుమర్తి వెంకటేశ్వరశర్మ ముఖ్యఅతిథిగా సభా వేదికను అలంకరించారు. ఆ రోజు కార్యక్రమానికి శర్మ బృందం ప్రదర్శించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం ముఖ్యాంశం.
రెండు గంటలకు ప్రసాద్ మరగాని, రాజరాజేశ్వరి కలగ ఆహ్వానం అనంతరం గణపతి ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొదటి భాగంగా నగరంలోని అన్ని సంగీత పాఠశాలల నుండి చిన్న, పెద్ద సంగీత కళాకారులు తెలుగు మహోన్నత వాగ్గేయకారులైన సద్గురు త్యాగరాజస్వామి, అన్నమయ్య, రామదాసు, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృతులను ఆలపించారు. స్వరాలయం ఆర్ట్స్ ఫోరం నుండి సీతారాం అయ్యగారి అనాదుడను గాను, అనూష అనుపిండి సామజ వరగమనా నికిత వల్లూరి, శ్రేయరెడ్డి, గాయత్రి ముళ్ళపూడి ఉదయ రవిచంద్రిక రాగం, ఎంతనేర్చిన వంటి కృతులతో అలరించారు.
వాగ్దేవి స్కూల్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ నుండి కావ్య పెన్మెత్స ధన్యాసి రాగంలోని 'సంగీత జ్ఞానము' వీనుల విందు చేయగా నిహారిక పాకల పాడిన 'తక్కువేమీ మనకు' సురాష్ట్ర రాగపు రామదాస కీర్తన అందరి మెప్పూ పొందింది. వీరి ఉపాధ్యాయిని శ్రీమతి రాజరాజేశ్వరి కలగ ఆలపించిన 'ఒకపరికొకపరి' అని ఖరహరప్రియలోని అన్నమయ్య కీర్తన తలలూపించింది. శ్రీమతి మాణిక్యం వెన్నెలకంటి శిక్షణలో ఆమని పిల్లుట్ల పాడిన 'నారాయణతే' ముచ్చట గొలిపింది. మాణిక్యం వెన్నెలకంటి బృందం పాడిన అన్నమయ్య కీర్తనలు రక్తిగా సాగాయి. శ్రీమతి సాయినిధి పాడిన 'అదే చూడరే' మోహన రూపం కార్యక్రమానికే వన్నె తెచ్చింది. రవి అయ్యర్, కొండలరావు పాడిన తారిణి అనే బాలమురళి విలక్షణమైన రచన ఆహూతులలో ఉత్సుకత కలిగించింది. ముకుంద, సునంద చిలుకూరి పాడిన నిగమ నిగమ శ్రుతి లయ బద్ధంగా సాగి బాగా ఆకట్టుకుంది.
Pages: 1 -2- News Posted: 4 November, 2009
|