నాట్స్ సంబరాలు ప్రారంభం

న్యూజెర్సీ : ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 2011లో నిర్వహించే 'అమెరికా తెలుగు సంబరాలు' ప్రారంభోత్సవ సూచనగా జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నవంబర్ 1న ఇక్కడి రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో ఈ కార్యక్రమాన్ని నాట్స్ వైభవంగా నిర్వహించింది.
నాట్స్ సంస్థ కెరీర్ అసిస్టెన్స్ డైరెక్టర్ అనిల్ బొప్పుడి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఆహ్వాన ప్రసంగం కూడా చేశారు. వరుణ్ వేముగంటి జాతీయ గీతాన్ని ఆలపించారు. యుగంధర్ రావు వల్లభనేని, శ్రీమతి సత్యవతి వల్లభనేని, డాక్టర్ పూర్ణ అట్లూరి, డాక్టర్ సుభ అట్లూరి, రవి మాదల, డాక్టర్ మధు కొర్రపాటి జ్యోతి వెలిగించి నాట్స్ సంబరాల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ గాయనీ గాయకులు శ్రీనిధి, రఘురాం మైమరపించే మధురగీతాలు, హుషారెత్తించే మషాళా పాటలతో వినోద కార్యక్రమాలను షురూ చేశారు.

2011లో జరిగే నాట్స్ సమావేశాలను న్యూజెర్సీలో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా నాట్స్ ప్రెసిడెంట్ రవి మాదల ప్రకటించారు. నాట్స్ సంస్థ ధ్యేయాలు, నిర్ణయాలు, అందిస్తున్న వివిధ రకాల సేవా కార్యక్రమాల గురించి ఆయన సవివరంగా వెల్లడించారు. నాట్స్ హెల్ప్ లైన్ విభాగం డైరెక్టర్ విజయ్ రెడ్డి అన్నపురెడ్డి మాట్లాడుతూ, తమ హెల్ప్ లైన్ (1-888-4- Telugu) అందిస్తున్న వివిధ సేవల గురించి తెలియజేశారు. పన్నెండు వందల మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నాట్స్ సంబరాల నిర్వహణ కోసం నిధుల సేకరణ సమయంలో ఆహూతులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. 487 వేల డాలర్లను అప్పటికప్పుడు విరాళంగా అందజేశారు. నాట్స్ సంస్థ అందజేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు అమెరికా ఈశాన్య ప్రాంతంలో తెలుగు యువకులు, పెద్దల నుంచి భారీగా స్పందన లభించింది.

అనంతరం పోలియో నిర్మూలన కోసం నాట్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను నాట్స్ కోశాధికారి డాక్టర్ వీరయ్య చుండు, రోటరీ క్లబ్ డైరెక్టర్ రిక్ బయిన్స్ తెలిపారు. వచ్చే సంవత్సరం నాట్స్ సంస్థ నిర్వహించాలని నిర్ణయించిన సేవా కార్యక్రమాల గురించి సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల సందర్భంగా అక్కడ నాట్స్ నిర్వహించిన సహాయ కార్యక్రమాలను నాట్స్ కార్యదర్శి శ్రీనివాస్ కోనేరు, శేఖరం కొత్త తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 6 November, 2009
|