వైభవంగా సాయి విగ్రహ ప్రతిష్ఠ

లివోనియా (డెట్రాయిట్ - మిచిగాన్) : శ్రీ షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు లివోనియా నగరంలోని సాయిబాబా ఆలయంలో ఐదు రోజులపాటు వైభవంగా జరిగాయి. రాజీవ్ తాలెం భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠాపన వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగింది. సాయి విగ్రహంతో పాటే దత్తాత్రేయ, విఘ్నేశ్వరుని విగ్రహాల ప్రతిష్ఠ కూడా వైభవంగా జరింది. ఈ సందర్భంగా నగరంలో పండుగ వాతావరణం కనిపించింది. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు మిచిగాన్ రాష్ట్రం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. అట్లాంటా నుంచి వచ్చిన ప్రధాన పూజారి గోపాల్ భట్టార్, అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పూజారులు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముంబాయిలో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి సింహాసనం ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విగ్రహ ప్రతిష్ఠాపన తొలి రోజు బుధవారం రామ పరివార సంప్రోక్షణంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల ఆలయ ప్రదక్షిణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల యాగశాల ప్రవేశం, భజనలు, మహా సంకల్పం, రక్షోజ్ఞ హోమం, కలశాధివాసం, జలాధివాసం, శేజ్ ఆరతి వైభవంగా నిర్వహించారు. రెండో రోజు గురువారం ఉదయాన్నే శ్రీ మహా గణపతి పూజ, దత్తాత్రేయ, సాయినాథ, శ్రీ రామ పరివార మూల మంత్రి హోమం, రుద్ర హోమం, క్షీరాధివాసం జరిగాయి. మధ్యాహ్నం నుంచి శ్రీ మహా గణపతి పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, హోమం, ధాన్యాధివాసం నిర్వహించిన తరువాత శేజ్ ఆరతితో ముగిశాయి. మూడో రోజు శుక్రవారం తెల్లవారు జామున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, హోమాలు, పంచగావ్య స్థాపన, మహా స్నపనం, పుష్పాధివాసం జరిగాయి. దూప్ ఆరతి తరువాత హోమంతో ప్రారంభమైన కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వీరందరి చేత రత్నన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమం శుక్రవారం నాటి కార్యక్రమాలన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రత్నన్యాసం సమయంలో విగ్రహం అడుగున భక్తులు వేసే నవరత్నాలను ఆలయ కమిటీ అందజేసింది. తరువాత ఆలయ కార్యనిర్వాహక మండలి సభ్యులు యంత్ర స్థాపన, అష్ట దిగ్బంధనం నిర్వహించారు. తరువాత అష్టలక్ష్మీ పూజ, శయ్యాధివాసం అనంతరం శేజ్ ఆరతితో ముగిసింది.

నాలుగవ రోజు శనివారం తెల్లవారు జామున వాస్తు శిల్పి చేత విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం ప్రాణ ప్రతిష్టాంగ హోమం, బింబ ప్రతిష్ఠ జరిగాయి. తరువాత ఆలయం బయట వేచి ఉన్న వేలాది మంది భక్తును ప్రథమాభిషేకం కోసం లోనికి అనుమతించారు. ఒక్కసారిగా భక్తులంతా ఆలయంలోనికి రావడంతో ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంలోనే బాబా విగ్రహాన్ని చక్కగా అలంకరించి, ప్రథమార్చన చేశారు. శ్రీ సీతారామ కల్యాణం, ఉమా మహేశ్వర కల్యాణం నిర్వహించారు. శేజ్ ఆరతితో నాలుగోరోజు కార్యక్రమాలు ముగిశాయి. ఐదవ, చివరి రోజు ఆదివారంనాడు ఆరతులతో పాటు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, సాయి సత్య వ్రతాలను వందలాది మంది దంపతుల చేత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి సుమారు పది వేల మంది వరకూ హాజరయ్యారు. వీరితో పాటు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం ప్రధాన పూజారి దిలీప్ సులఖే కూడా పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రథమాభిషేకం, ప్రథమార్చన సులఖే చేతుల మీదుగా జరిపించారు.
Pages: 1 -2- News Posted: 20 November, 2009
|