ఎన్నారై వాసవైట్ల ఉదారత

కర్నూలు : రాష్ట్రాన్ని ఇటీవల ముంచెత్తిన భారీ వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అమెరికా ఎన్నారై విఎ సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది. కర్నూలులోని వాసవి ఆలయంలో నవంబర్ 25న నిర్వహించిన కార్యక్రమంలో 108 వరద బాధిత కుటుంబాలకు ఈ సంస్థ ప్రతినిధులు ఈ సహాయాన్ని పంపిణీ చేశారు. ఒక్కొక్క బాధిత కుటుంబానికి 4 వేల రూపాయల చొప్పున కర్నూలు శాసనసభ్యుడు టిజి వెంకటేశ్ చేతుల మీదుగా అందజేశారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, కల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపురానికి చెందిన 108 మంది బాధిత కుటుంబాలు ఎన్నారై విఎ సహాయాన్ని అందుకున్నాయి. ఎన్నారై విఎ ముఖ్య సభ్యులు సురేష్, ప్రసాద్, కిశోర్ అమెరికా నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరో నలుగురు ఎన్నారై విఎ ముఖ్య సభ్యులు కిట్టన్న, సుదర్శన్, రవికాంత్, శ్రీధర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని రవికాంత్ గార్లపాటి చక్కని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. మధుమోహన్, రాజశేఖర్, శ్రీధర్ ఐతా, కిశోర్, సురేష్ తమ సహాయ సహకారాలు అందించారు. వరదల్లో ఎక్కువగా నష్టపోయిన కుటుంబాలను గుర్తించడంలోనూ, వాటిలో మళ్ళీ అత్యధికంగా కష్టాలు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఎంపిక చేయడంలోనూ రవికాంత్ బృందం క్షేత్ర స్థాయిలో విశేషంగా కృషి చేసింది. బాధిత కుటుంబాల ఎంపిలో కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేశ్, సుధాకర్, మధు, రాజశేఖర్, తదితరులు సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక సహాయం పంపిణీకి ఎంపికైన బాధిత కుటుంబాలకు ముందుగానే కమిటీ సభ్యులు టోకెన్లు పంపిణీ చేశారు. సహాయం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లలో వాసవీ ఆలయం కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్ చక్కని తోడ్పాటు అందించారు. వరద బాధితులకు సహాయం అందించే విషయంలో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 25 వరకూ ప్రతి విషయాన్నీ ఎన్నారై విఎ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ గార్లపాటి చక్కగా సమన్వయం చేశారు.
Pages: 1 -2- News Posted: 27 November, 2009
|