చికాగోలో తెలంగాణ ప్రతిధ్వని

చికాగో : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటానికి చికాగో, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. చికాగో శివారు నగరం నేపర్ విల్లెలో తెలంగాణ ఎన్నారైలు నిర్వహించిన నిరసన సమావేశం 'జై తెలంగాణ' నినాదం మార్మోగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఎన్నారైలంతా తెలంగాణ ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులు అర్పించడంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం మా భూమీ ఫేమ్ సంధ్య 'తెల తెలవారగ తొలిరేఖలై విచ్చి తెలంగాణ కోసమై ప్రాణాలు ఇచ్చిన వీరులారా మీకు జోహార్లు' అంటూ పాడారు.
కేవలం ఒక్క రోజు ముందుగా ఈ సమావేశం సమాచారం అందజేసినప్పటికీ 75 మంది తెలంగాణ ఎన్నారైలు హాజరై, తెలంగాణ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రశంసించిన తెలంగాణ ఎన్నారైలు ఉద్యమాన్ని బలవంతంగా అణచివేస్తున్నదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిఎన్నారైలు భారతదేశంలోని తెలంగాణ ప్రజలకు ఈ సమావేశం ద్వారా ఒక సందేశాన్ని పంపించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన యువకులకు తెలంగాణ ఎన్నారైలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అలాగే ఉద్యమంలో భాగంగా ఇకపై ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం మనం అంతా పోరాడుతున్నది జీవించడానికే గాని మరణించడానికి కాదన్న సత్యాన్ని యువత గ్రహించాలని గుర్తు చేశారు. భవిష్యత్ అంతా యువకులదే అని, అందుకోసం జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన శాంతియుత, ప్రజాస్వామ్య మార్గంలో ఆందోళన నిర్వహించాలని టిఎన్నారైలు సూచించారు. లక్ష్యాన్ని సాధించడంపైనే గురి పెట్టాలి కాని గుండె దిటవును కోల్పోవద్దని తెలంగాణ ప్రజలకు టిఎన్నారైలు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం అనే లక్ష్యసాధన కోసం తెలంగాణ వాసులను వర్గాలకు అతీతంగా కేసీఆర్ ఏకం చేశారని తెలంగాణ ఎన్నారైలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం శిఖరాగ్రానికి చేరుకుందని, ఇలాంటి కీలక దశలో కేసీఆర్ నాయకత్వం అత్యంత ఆవశ్యకమని వారు పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని తెలంగాణ ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు.
Pages: 1 -2- News Posted: 7 December, 2009
|