విభజనకు ఎన్నారైల విముఖత

న్యూజెర్సీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పలువురు ఎన్నారైలు అభ్యంతరం చెప్పారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టడం ఆరోగ్యకరమైనది కాదన్నారు. రాష్ట్రాన్ని విభజించేందుకు గతంలో కూడా అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయని, అయితే, విడిపోవడం వల్ల నష్టాలే ఎక్కువని గ్రహించడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. అయితే, ఈ సారి రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు, సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొందరు స్వార్ధ రాయకీయ నాయకుల కుట్రే కారణమని వారు ఆరోపించారు. వెనుకబాటుతనం నిర్మూలనకు చిన్నరాష్ట్రాల ఏర్పాటు ఒక్కటే పరిష్కారం కాదని ఎన్నారైలంతా ముక్తకంఠంతో ఖండించారు. సమైక్యాంధ్ర రాష్ట్రానికి మద్దతుగా న్యూజెర్సీలోని పిస్కాటవేలో ప్రవాసాంధ్రులు సమావేశమయ్యారు. కింగ్స్ బ్రిడ్జి రోడ్డులోని రాడిసన్ హొటల్ లో డిసెంబర్ 20న జరిగిన ఈ సమావేశానికి పలువురు ఎన్నారైలు, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి అమెరికా పర్యటనకు వచ్చిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు, వాణిజ్యవేత్తలు, ఐటి, ఫార్మసీ, ఫైనాన్స్, ఇతర పరిశ్రమలు లాంటి రంగాలకు చెందిన తెలుగువారు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చ ప్రధానంగా సమైక్యాంధ్రపైనే దృష్టి సారించింది.
కిరణ్, రాజ్ గోపాల్ నందివాడ, కానూరి శేషుబాబు, రామానాయుడు, శిరీష, శశి మానేపల్లి, సత్యనారాయణరావు, కొడాలి రమేష్, పద్మజ అన్నె, కర్రి సుందర్ లాంటి ప్రసిద్ధులైన వక్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆంధ్రరాష్ట్ర విభజనకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవలి ఆందోళనల సందర్భంగా తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో మరణించిన విద్యార్థులకు నివాళులు అర్పించారు. ఉద్రేకపూరిత, ఆవేశపూరిత విధానాలకు, ఆలోచనలకు స్వస్తి పలికి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని, ఐకమత్యాన్ని కాపాడాలని విద్యార్థులకు ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. సమావేశం ప్రారంభంలో మధురమైన భక్తిగీతాన్ని ఆలపించారు. స్వాతి గుండపనీడి నృత్య దర్శకత్వంలో 'మా తెలుగుతల్లికి' నృత్యాన్ని కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తామని ప్రతిజ్ఞాపత్రంలో సంతకాలు చేశారు.
Pages: 1 -2- News Posted: 23 December, 2009
|