టాక్ట్ సంక్రాంతి సంబరం
మిడిల్ టౌన్ (కనెక్టికట్) : తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ (టాక్ట్) ఆధ్వర్యంలో జనవరి 23 శనివారం నాడు 2010వ సంవత్సరపు సంక్రాంతి సంబరాలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. సంవత్సరం మొత్తంలో జనవరి నెల మందకొడిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వెనక్కి నెట్టివేస్తూ సంబరాలకు అంచనాలకు మించి అతిథులు హాజరై విజయవంతం చేశారు. మిడిల్ టౌన్ లోని హిందూ టెంపుల్ ఆడిటోరియంలో ఈ సంబరాలు నిర్వహించారు. తెలుగు సంస్కృతిని, ఐక్యతను ప్రతిబింబించే సంక్రాంతి సంబరాలను ఈశాన్య రాష్ట్రమైన కనెక్టికట్ లో టాక్ట్ సంస్థ ప్రతి సంవత్సరమూ క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా శాస్త్రీయ భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రదర్శించారు. సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన 'బంగారు కోడిపెట్ట', 'నువ్వు రెడీ నేను రెడీ' పాటలకు మహి అరోరా డ్యాన్స్ స్కూల్ కు చెందిన చిన్నారులు చక్కగా డ్యాన్సులు చేశారు. 'దశావతారం' సినిమాలో ప్రసిద్ధి చెందిన పాటలకు, 'ఓహో బస్తీ దొరసాని' పాటను రీమిక్స్ తో చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
సాహితి అలవల 'వందే మీనాక్షి', 'శ్రీ గణనాథ','స్వరజతులు'ను వయొలిన్ పై వాయిస్తూ వీనులవిందు చేశారు. 'భావములోన భాగ్యములోన' పాటకు గాయత్రి శివలెంక, శ్రీవాణి అగ్నిహోత్రం చక్కని శాస్త్రీయ సంగీతంతో శ్రోతలను ఆనందడోలికల్లో ముంచెత్తారు. సంక్రాంతి పండుగ కథాంశంగా 'మన పండుగలు' పేరున నిర్వహించిన జానపద నృత్యం అందరినీ అలరించింది. తెలుగు స్కూల్ కు చెందిన చిన్నారులు పాడిన 'సంక్రాంతి/ భోగి', 'తెలుగు పద్యాలు', తెలుగు భక్తిగీతాలకు ఆశీర్వ, అపూర్వ అళహరి, సమీర ఒబ్బు, శ్రీరాం అలవల తదితరులు వినిపించిన సంస్కృత శ్లోకం ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Pages: 1 -2- News Posted: 29 January, 2010
|