యుఎస్ లో 'మాయాబజార్'

ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులతో మమేకమైన విజయా వారి 'మాయాబజార్' ఇప్పుడు గోల్డ్ స్టోన్ టెక్నాలజీకి చెందిన కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్ మోహన్ నేత్వంలో కలర్, సినిమాస్కోప్, డిటిఎస్ టెక్నాలజీతో రంగుల 'మాయాబజార్'గా కొత్తరూపు సంతరించుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. జనవరి 30న ఆంధ్రదేశమంతటా విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ధీరూబాయ్ అంబానీ గ్రూప్ నకు చెందిన రిలయన్స్ మీడియా వర్క్క్ ద్వారా యు.ఎస్.ఎ.లో ఫిబ్రవరి 5న విడుదలవుతోంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం విడుదలలో భాగస్వామి తమకెంతో గర్వంగా ఉందనీ రిలయన్స్ మీడియా వర్క్క్ ప్రతినిధులు తెలియజేశారు.
విజయా బ్యానర్ పై కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన 'మాయాబజార్' చిత్రాన్ని తెలుగు-నలుపు రంగుల్లో బి.నాగిరెడ్డి, చక్రపాణి సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. 1957 మార్చి 27న తెలుగులో విడుదలై ఈ చిత్రం నభూతో నభవిష్యతి అనే విధంగా ఉద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏప్రిల్ లో తమిళ వెర్షన్ రిలీజైంది. ఆ తర్వాత కన్నడంలో అనువాదమైంది. తెలుగు సినీ చరిత్రలోనే అద్భుత కళాఖండంగా ఇప్పటికే చెక్కుచెదరని కీర్తిని ఈ చిత్ర ఆర్జించింది. ఈ చిత్రానికి కె.వి.రెడ్డి అందించిన స్క్రీన్ ప్లే ఆ తర్వాత ఎందరో ఔత్సాహిక రచయితలకు మార్గదర్శిగా నిలిచింది. ఈ చిత్రానికి పింగళి నాగేంద్రరావు అందించిన కథ, మాటలు, పాటలు అజరామరంగా నిలిచాయి. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు (ఆయన పేరు టైటిల్స్ లో చోటుచేసుకోలేదు), ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన సంగీతం ఇప్పటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది. నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుడుగా, అక్కినేని నాగేశ్వరరావు అభిమన్యుడుగా, ఎస్.వి.రంగారావు ఘటోత్కచుడుగా, శశిరేఖగా సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు బలరాముడుగా అనితర సాధ్యమైన నటన ప్రదర్శించారు. రేలంగి, రమణారెడ్డి, బుషేంద్రమణి, వంగర, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ఛాయాదేవి, సంధ్య తదితర కళాకారులంతా తమ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ చిత్రానికి చిరకీర్తి తెచ్చిపెట్టారు.
Pages: 1 -2- News Posted: 3 February, 2010
|