'తెలంగాణలో సమైక్యాంధ్ర' అట్లాంటా : సమైక్యాంధ్ర భావజాలాన్ని తెలంగాణ జిల్లాల్లో వ్యాపింపజేసే ఉద్యమం అతి జాగ్రత్తగా కొనసాగుతున్నదని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. కోస్తా, రాయలసీమ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల ప్రజలతో గట్టి సంబంధ బాంధవ్యాలున్న తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ముందుగా ఈ ఉద్యమం ప్రారంభమైందని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర భావానికి తమ జన్మస్థలాల్లో బాగా ప్రచారం కలిగేలా ప్రవాసాంధ్రులు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న కొందరు తెలంగాణ ప్రాంత ప్రవాసాంధ్రులతో రాజగోపాల్ కాన్ఫరెన్స్ కాల్ లో సంభాషించారు. ఫిబ్రవరి 14 ఉదయం 'ఆంధ్రప్రదేశ్ ఎన్నారై ఫోరం లీడర్ షిప్ టీమ్' నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్ కార్యక్రమంలో రాజగోపాల్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఎపి ఎన్నారై ఫోరం చేస్తున్న కృషిని రాజగోపాల్ అభినందించారు. వెంకట్ మొండెద్దు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, గుంటూరు, కడప, ఖమ్మం, కృష్ణా, నల్గొండ, నిజామాబాద్, ఒంగోలు, శ్రీకాకుళం, వరంగల్ జిల్లాల నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. వీరంతా ఫార్మసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడిసిన్, ఇతర వ్యాపార రంగాల్లో స్థిరపడినవారే. గత డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చేసిన ప్రకటన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి పలువురు ఎన్నారైలు అడిగిన అనేక ప్రశ్నలకు లగడపాటి ఓపికగా సమాధానాలిచ్చారు. సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర నాయకులు, ప్రవాసాంధ్రులు ఏ విధంగా భాగస్వాములు కావచ్చనే అంశంపై లగడపాటి వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యఅతిథి లగడపాటి రాజగోపాల్ ను అట్లాంటాలో స్థిరపడిన గురవారెడ్డి కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొన్న ప్రవాసాంధ్రులకు పరిచయం చేశారు. ఎపి ఎన్నారై ఫోరం సభ్యులను పున్నం మంతెన పరిచయం చేశారు. ఫోరం ఏర్పాటుకు గల కారణాలు, లక్ష్యాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆయన టూకీగా ప్రస్తావించారు.
లగడపాటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, సమైక్యాంధ్ర కోసం ఎన్నారైలు కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొందరు ఎన్నారైలు మద్దతు తెలుపుతుండడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిస్థితులపైన, రాష్ట్రానికి ఆ పేరు రావడం వెనుక గల చరిత్ర గురించి లగడపాటి సూక్ష్మంగా వివరించారు. తెలంగాణ ప్రాంత ప్రజల మేలు కోసం ఇచ్చిన ముల్సీ నిబంధనలు, పెద్దమనుషుల ఒప్పందం లాంటి హామీలు సహేతుకమైనవే అన్నారు. 1969 - 71 సంవత్సరాల్లో రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల ఒప్పందం వచ్చిందని లగడపాటి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తాను చురుగ్గా పాల్గొంటున్నట్లు లగడపాటి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున వర్శిటీ విద్యార్థుల ఆహ్వానం మేరకు వారితో సమావేశమైనట్లు చెప్పారు. సమైక్యాంధ్ర వల్ల వచ్చే లాభాల గురించి తన అభిప్రాయాలను ఉస్మానియా వర్శిటీ విద్యార్థులతో పంచుకోవాలనుకుంటున్నానని, వారి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నానన్నారు.
Pages: 1 -2- News Posted: 16 February, 2010
|