నాట్స్ వైద్య శిబిరం సక్సెస్

న్యూజెర్సీ : ప్రవాసాంధ్రులకు సేవలు అందించడంలో ముందున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సంస్థ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది. బ్రిడ్జివాటర్ లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఓల్డ్ సన్నిధానం హాలులో ఈ నెల 21 ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు, బరువు తగ్గింపుపై సలహాలు, గుండె ఆరోగ్యం, తక్కువ కొలెస్ట్రాల్, చక్కెర వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన ఆహారంపై న్యూట్రిషనల్ కన్సల్టెంట్ల సలహాలు, గుండెపోటు రావడానికి ముందుగా కనిపించే లక్షణాలను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ వినీత్ కొర్రపాటి, డాక్టర్ మాధురి అడబాల నిర్వహించిన 'బోన్ మారో డ్రైవ్' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముప్పై మందికి పైగా దాతలు బోన్ మారో దానం చేసేందుకు ముందుకు వచ్చారు. పలువురు నిపుణులైన వైద్యులను నాట్స్ ఉచిత వైద్య శిబిరానికి ఆహ్వానించి, వారి సేవలు అందించడంలో డాక్టర్ మధు కొర్రపాటి విశేషంగా కృషి చేశారు.

అమెరికాలో నివాసం ఉంటున్న తమ పిల్లల వద్దకు భారతదేశం నుంచి వచ్చిన పలువురు వృద్ధ తల్లిదండ్రులు, నిరుద్యోగ కుటుంబాల వారు, విద్యార్థులు నాట్స్ ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చి నిపుణులైన వైద్యుల నుంచి వైద్య సలహాలు, సూచనలు పొందారు. డాక్టర్ మధు కొర్రపాటి నేతృత్వంలో ప్రత్యేక అంశాల్లో నిపుణులైన వైద్యులు మహేష్ బిక్కిన (కార్డియాలజీ), రమేష్ ఏలూరి (సైకియాట్రి), జనార్ధన్ బొల్లు (గ్యాస్ట్రో ఎంటరాలజీ), సూర్యప్రకాశ్ గంటి (అనెస్తీషియా, క్రిటికల్ కేర్ మెడిసిన్), పురుషోత్తం సూరపనేని (ఇంటర్నల్ మెడిసిన్), యుగంధరరావు వేములపల్లి (సైకియాట్రి, వెయిట్ లాస్), శ్రీదేవి రమ (ఊబకాయం, గైనకాలజీ), లక్ష్మీ లావణ్య సొడగం (నెఫ్రాలజీ), వినీత్ కొర్రపాటి (ఇంటర్నల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ), శ్రీనివాస్ కట్టా (ఇంటర్నల్ మెడిసిన్), షౌనక్ ద్వివేది (ఇంటర్నల్ మెడిసిన్, నెఫ్రాలజీ), కశ్చిత్ పాండ్య (బ్లడ్ సుగర్ నిర్ధారణ) విశేష సేవలు అందించారు. శిబిరానికి హాజరైన వారిలో పలువురిలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా హైపర్ టెన్షన్, చక్కెర వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయా వ్యాధుల నివారణలో నిపుణులైన వైద్యులను సంప్రతించాలని సూచించారు.
Pages: 1 -2- News Posted: 24 February, 2010
|