లోటుకు నోట్లతో లింకు
ముంబైః ఉపా ప్రభుత్వం దేశ ద్రవ్య వనరులన్నిటినీ పూర్తిగా ఖాళీ చేసింది. పన్నుల రాబడి తగ్గిపోయింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ప్రజలకు ఎరగా వేసే ఎన్నికల ముందస్తు పథకాల కోసం ప్రభుత్వం బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాబడి తగ్గిన ప్రభుత్వ ఖజానా ద్రవ్యలోటును ఎదుర్కుంటోంది. ప్రభుత్వం తాను నెరవేర్చవలసిన పనులకు గాను డబ్బును అదనంగా ముద్రించి ద్రవ్యలోటును పూడ్చుకునే పనిలో తీరిక లేకుండా ఉంది. తన ఆదాయ-వ్యయ గండిని పూడ్చుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం 66,946 కోట్ల రూపాయలను ముద్రించింది.ఎన్నికల సీజను దగ్గరపడే కొద్దీ ప్రభుత్వం మరింత అదనంగా ద్రవ్యాన్నిముద్రించనుంది.ఆ నోట్లను వోట్లగా మార్చేందుకు ఉపా వినియోగించుకోనుంది.ప్రజలు కోరుకున్న రుణాల కంటే ప్రభుత్వం అదనంగా ద్రవ్యాన్ని ముద్రించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ బాధ్యతను రిజర్వ్ బ్యాంక్ పై పెట్టింది. సాంకేతికంగా ఆ పనిని ప్రభుత్వ రుణ సేకరణ (బారోయింగ్ )గా పిలుస్తారు. ప్రభుత్వం తన ఖర్చుల కోసం డబ్బును అడ్డగోలుగా ముద్రించడంగా మనం పిలుస్తాము.
ఇలా వేల కోట్ల రూపాయల డబ్బును చలామణి అవసరం కంటే అదనంగా ముద్రించి ప్రభుత్వం తన పబ్బం గడుపుకునేందుకు చూస్తోంది. ఇలా ద్రవ్య ముద్రణా చర్యల పర్యవసానంగా అనతి కాలంలోనే అత్యధిక ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశముంటుంది. గత ఏడాది ఆగష్టు లో 13 శాతం అత్యున్నత స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణం ప్రభుత్వ, ఆర్బిఐ చర్యల వల్ల 5 శాతానికి చేరుకోవడం అందరికి ఆనందమే. అయితే ఉపా ప్రభుత్వ ద్రవ్య లోటును సవరించే చర్యల వల్ల ద్రవ్యోల్బణం తిరిగి విజృంభించగలదు. అప్పటిదాకా ద్రవ్యోల్బణం సుషుప్తావస్థలో ఉంటుంది. ఆ భూతం తప్పకుండా మళ్లీ వస్తుంది. కేవలం ఉపా ప్రభుత్వ చర్యల వల్ల తిరిగి పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్సులు జనరంజక పథకాలకు ఖర్చై పోయాయి. గత ఏడాది ప్రభుత్వం 60వేల కోట్ల రూపాయల రైతాంగ రుణ మాఫీ పథకాన్ని ప్రకటించింది. ఆరవ వేతన సంఘం నివేదిక, పెద్ద ఎత్తున ఆయిల్ ,ఫెర్టిలైజర్స్ సబ్సీడీలు వెరసి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. ఫలితంగా- 2008 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య ఒక అగాధం ఏర్పడింది.ఈ అగాథం అంటే కేంద్ర ద్రవ్య లోటు దాదాపు 2,18,262 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది కేవలం అధికారిక గణాంకం మాత్రమే. అనధికారికంగా,ఇంధనం, ఎరువుల సబ్సిడీలను కూడా కలుపుకుంటే ఈ లోటు 3,04,204 కోట్ల రూపాయలుగా ఉంది.
2008-09 ఆర్దిక సంవత్సరంలో ద్రవ్యలోటు 1,33,287 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అయితే నిజమైన ద్రవ్యలోటు, బడ్జెట్ కేటాయింపులు వెరసి ప్రభుత్వం అదనంగా రుణ సేకరణకు,ముమ్మరంగా నోట్ల ముద్రణకు దారితీసింది. పిండేస్తున్న ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు ఉపా ప్రభుత్వం దాదాపు 66,946 కోట్ల రూపాయలను ముద్రించింది. 2009 జనవరి 30నాటికి ప్రభుత్వ విత్త లోటు 66,946 కోట్ల రూపాయలుగా ఉండింది.ద్రవ్యలోటును సాంప్రదాయక పద్ధతుల్లో పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుండి రుణం తీసుకుంది. 2008నాటికి రిజర్వ్ బ్యాంకు నుండి తీసుకున్న ద్రవ్యలోటులో నాల్గవ వంతును రిజర్వ్ బ్యాంకు రుణంగా ప్రభుత్వం సేకరించింది.
ఎందుకు ఇలా జరిగింది? వాస్తవాలు ఆ కథను వివరిస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజికి చాలా ఖర్చవుతుంది. మరోవైపు, ప్రభుత్వ ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి.పరోక్ష పన్నులపై తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు 10వేల కోట్ల రూపాయల గండి పడింది. అదే సమయంలో ఆర్దిక వ్యవస్థ మందగిచండంతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గింది. ప్రత్యక్ష పన్నల నుండి వచ్చే ఆదాయం కూడా అధ్వాన్నంగా తయారయ్యింది. దాంతో ఒక లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. బడ్జెట్ అంచనాల కంటే ప్రభుత్వ రుణ సేకరణ కార్యక్రమం మరింతగా పెరిగిపోయింది. 1,78,575 కోట్ల రూపాయల రుణ సేకరణ స్థానంలో 2,52,154 కోట్ల రూపాయలను ప్రబుత్వం రుణంగా సేకరించనుంది. 2009 మార్చ్ లోగా మరో 50వేల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం సేరించనున్నట్లు రిజర్వ్ బ్యాంకుకు ఇప్పటికే సందేశాలు అందాయి.
రిజర్వ్ బ్యాంకు వద్ద ప్రభుత్వ విత్త నిల్వలు వేగంగా తరగిపోతున్నందుకు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపాలి. 2008 డిసెంబర్ నాటికి విత్తం రూపంలో ప్రభుత్వం 60,959 కోట్ల రూపాయలను ఆర్బిఐ నుండి తీసుకుంది. అయితే 2008-09 బడ్జెట్ లో క్యాష్ హోల్డింగ్్ కేవలం 7,224 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం అంచనా వేసింది. దాంతోపాటు, ప్రభుత్వం పలు మార్గాల్లో, పలు కోణాల్లో మరో 11,654 కోట్ల రూపాయల్ని సేకరించింది. ప్రభుత్వ ఖజానా ద్రవ్య లోటును ఎదుర్కొంటున్న సమయంలో రిజర్వ్ బ్యాంకు నుండి రుణాల్ని సేకరించడం మంచిదే.దాన్ని మానిటైజ్డ్ డెఫిసిట్ గా పిలుస్తారు. ప్రభుత్వ విత్త నిల్వలను సమకూర్చేందుకు ఆర్బిఐ వద్ద టేరెజరీ బిల్లులను, బాండ్లను ప్రభుత్వం అట్టిపెడుతుంది. ఈ ద్రవ్యరూప లోటు బాగా పెరిగిపోయింది.పర్యవసానంగా ఈ ఏడాది చివరినాటికి లేదా 2010 నాటికి ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున విజృంభించక తప్పదు.
News Posted: 9 February, 2009
|