(వరప్రసాద్ గాలిదేవర)
అసలు ఈ ఆత్మీయ గురుశిష్యుల నడుమ ఐదేళ్ళ నుంచీ అంతర్గత అసంతృప్తులు ఉన్నాయి. ఒక దశలో సత్తిబాబు మంత్రి అయినందుకు శివుడు శివాలుతొక్కారు. సత్తిబాబు వ్యతిరేకులకు నాయకత్వం వహించారు. గురువు సాంబశివుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి సత్తిబాబు నానా తంటాలు పడ్డారు. ప్రాంతీయ అభివృద్ధి మండలిని సృష్టింప చేసి ఆ మాయా సింహాసనంపై కూర్చోబెట్టారు. చివరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం అలంకరించాల్సిందిగా ప్రాధేయపడి ఒప్పించారు. లోలోపల రగిలిపోతున్నా ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉన్నట్టే కనిపించారు. అలకపాన్పులెక్కినా మంత్రి సత్తిబాబును కాదని మనగలిగే శక్తి శివునికి సన్నగిల్లింది. అలా అని గురువును వదిలేసి, చెడ్డ పేరు మూట గట్టుకునే ధైర్యం సత్తిబాబు, రాజకీయాలలోకి వచ్చిన అతని కుటుంబసభ్యులు ఏనాడూ చేయలేదు. కాని ఈసారి పరిస్థితులు చిక్కు సమస్యలనే తెచ్చిపెట్టాయి. సత్తిబాబు ప్రోద్భలంతోనే రాజకీయాలలోకి వచ్చినా అటు సోదరుడు అప్పలనర్సయ్య గజపతినగరం అసెంబ్లీ సిగ్మెంట్లో స్వయం ప్రకాశం గల నాయకునిగా ఎదిగారు. తెలుగుదేశం ఖాతాలో ఉన్నబొబ్బిలి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ప్రతిష్టాత్మకంగా గెలిచిన ఝాన్సీ ఢిల్లీ అధిష్టానం దగ్గర గుర్తింపు పొందారు. విధ్యాధికురాలైన మహిళా ఎంపీగా కూడా ఆమె అనేక అంతర్జాతీయ సదస్సులకు దేశం తరపున పాల్గొనే గౌరవాన్ని సంపాదించుకున్నారు. గురువు సాంబశివరాజుకు చోటు చూపెట్టడం కోసం వీరిని తప్పించడం మంత్రి సత్తిబాబుకు తలకు మించిన భారం గానే తయారైంది.
గురుశిష్యుల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి. పత్రికల్లో కథనాలు పుంఖానుపుంఖాలు వచ్చాయి. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన వయస్సులో సాంబశివరాజు మళ్ళీ టిక్కెట్ కోసం వెంపర్లాడటం బొత్స వర్గీయులకు రుచించలేదు. ఒకవేళ శివుడు తగ్గినా ఆది నుంచీ జిల్లాలో రాజకీయ వైభవాన్ని అనుభవిస్తున్న అల్పసంఖ్యాక క్షత్రీయులు ఒక్కసారిగా తమ ప్రాభావాన్ని వదులుకోవడం సహించలేకపోయారు. దాంతో సాంబశివరాజుపై వత్తిడి పెంచారు. ఇలాంటి అనేకానేక కారణాల వల్ల ఆవేశపడిన సాంబశివరాజు శిష్యునిపై బహిరంగంగానే ధ్వజం ఎత్తారు. మంత్రి సత్తిబాబు ఇంటిలోనే ముగ్గురికి పదవులా అంటూ విరుచుకుపడ్డారు. దీనితో సంయమనం కోల్పోయిన శిష్యుడు తొలిసారిగా నోరు జారారు. అక్కడి నుంచి నిప్పు రవ్వలు రాజుకున్నాయి. మంత్రి వెనుకే ఉండే భట్రాజులు మరికొంత ఆజ్యం పోశారు.