ప్రభుత్వానికి చిరు 'చెక్'
హైదరాబాద్ : ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ఆ అవకాశాన్ని ప్రజారాజ్యం పార్టీ తీసుకుంటుందని ఆ పార్టీ అధినేత, శాసనసభలో పిఆర్పీ నేత కొణిదెల చిరంజీవి పేర్కొన్నారు. ప్రజోపయోగ, అభివృద్ధికారకమైన, మంచి పనులు చేస్తున్నంతసేపూ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చిరంజీవి బుధవారం ఉదయం చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళను హోంమంత్రి పదవికి ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అయితే సెజ్ ల పేరుతో రైతులను అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో ప్రభుత్వం కమిటీలు వేయడంతో సరిపెట్టుకోకుండా కమిట్ మెంట్ తో వ్యవహరించాలని చిరంజీవి సూచించారు.
అసెంబ్లీలో తాము షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూసినప్పుడు మనస్సు పులకరించేదన్నారు. అయితే, అలాంటి చక్కని అనుభూతి కలిగించే బాపూజీ విగ్రహం ఉన్న ఆవరణలోనే నాయకులు రాజకీయాన్ని స్వార్ధానికి ఉపయోగించుకోవడం బాధ కలిగిస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో సామాన్యులు సతమతం అవుతుంటే, ప్రజా జీవితాలతో నాయకులు ఆడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం ఇంకా అభివృద్ధి చెందాలని చిరంజీవి ఆకాంక్షించారు. అందుకు అవసరమైన తక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ఆయన సూచించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు విద్యుత్ ను కూడా సక్రమంగా నాణ్యంగా అందచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలతో కూలి బతుకులు చితికిపోతున్నాయని, వారి జీవితాలు బాగుపడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీల కోసం కేటాయించిన లక్ష కోట్ల బడ్జెట్ ఏమైపోతున్నదో తెలియడం లేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
Pages: 1 -2- News Posted: 10 June, 2009
|