తగ్గిన 'తానా' ఎంట్రీ ఫీజు
`సాంకేతిక వికాసం- సాంస్కృతిక విన్యాసం' అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలలో వినోద కార్యక్రమాలతో పాటు వివిధ రంగాల్లో తెలుగువారి ఉన్నతికి తోడ్పడగల సాంకేతిక, ఆధ్యాత్మికత అంశాలకు కూడా నిర్వాహకులు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. షికాగోలో సువిశాల ప్రాంగణం కలిగిన రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్న ఈ సభలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వందలాది తెలుగు ప్రముఖులు ఈ సభలలో పాల్గొంటున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతివారికి మన సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేయడం, మాతృభూమితో వారి బంధాన్ని పరిపుష్టం చేయడం కోసం ఈ సభలను ప్రత్యేకంగా యువతను ఆకట్టుకునేలా నిర్వహించనున్నారు. సంస్కృతి, కళలు, సాహిత్యం, ఆధ్యాత్మిక, తాత్విక, వ్యాపార, వాణిజ్య అంశాలలో ఈ మూడు రోజులూ సదస్సులు, సమావేశాలు జరగనున్నాయి.
`తానా' ఆవిర్భవించిన తర్వాత షికాగోలో మహాసభలు నిర్వహించడం ఇది మూడవసారి. ఈసారి పది వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు ప్రభాకర చౌదరి కాకరాల తెలిపారు. ఆయనతో పాటు సభల సమన్వయకర్త యడ్లపాటి యుగంధర్, వివిధ కమిటీల బాధ్యులు నిర్విరామంగా కృషిచేస్తున్నారు. అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్, ఇల్లినాయ్ గవర్నర్ ప్యాట్ క్విన్ గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలూ అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ ఐ.వి. సుబ్బారావు సభలకు విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గల్లా అరుణ కుమారి వస్తున్నారు. వారితో పాటు వివిధ పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలు హాజరవుతున్నారు.
ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపై పెద్దగా పడకుండా నివారించడంలో కీలకపాత్ర పోషించిన రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి. రెడ్డి ఈసారి తానా సభలకు ప్రత్యేక ఆహ్వానితునిగా వస్తున్నారు. సభలలో ఆయన కీలకోపన్యాసం చేస్తారు. భారతదేశంలో టెలికాం విప్లవాన్ని సృష్టించిన శ్యాం పిట్రోడా ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. తెలుగు పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికులకు మార్గదర్శనం చేసి, వ్యాపారభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో వందలాది మంది ప్రముఖులను తానా కమిటీ ఆహ్వానించింది. 3, 4 తేదీలలో జరిగే బిజినెస్ సెమినార్లలో భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా, సువెన్ లైఫ్ సైన్సెస్ సీఇఓ డాక్టర్ జాస్తి వెంకట్, హైఫై నెట్ వర్క్స్ వ్యవస్థాపకుడు రాము యలమంచి, అమరరాజ బ్యాటరీస్ ఎం.డి. జయదేవ్ గల్లా, సోలార్ సెమికండక్టర్ సీఇఓ హరి సూరపనేని, జి.ఎం.ఆర్. గ్రూపు డైరెక్టర్ సి. ప్రసన్న, తెలుగుపీపుల్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి, సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బి. భాస్కరరావు, సినీ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, కమ్యూనికేషన్ రంగ నిపుణుడు టి. హనుమాన్ చౌదరి తదితరులు ప్రసంగించనున్నారు. ఐ.టి. ప్రొఫెషనల్స్ కు వీసా సంబంధిత అంశాలపై సుప్రసిద్ధ అటార్నీ శీలా మూర్తి ఉచితంగా మార్గదర్శనం చేస్తారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 22 June, 2009
|