తగ్గిన 'తానా' ఎంట్రీ ఫీజు
సాహితీ రంగానికి కూడా ఈ సభలలో పెద్దపీట వేస్తున్నారు. మేడసాని మోహన్ అష్టావధానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రాళ్లబండి కవితాప్రసాద్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ వెల్చేరు నారాయణరావు, సుద్దాల అశోక్ తేజ, అక్కిరాజు సుందర రామకృష్ణ, మహాకవి శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ, వాసిరెడ్డి నవీన్, అందెశ్రీ, శ్రీరమణ, పాపినేని శివశంకర్, సూర్యదేవర రామమోహన్ రావు, చంద్రబోస్, గోరటి వెంకన్న తదితరులు హాజరవుతున్నారు. లలితా కామేశ్వరి, రమా కుమారిల విశిష్ట కార్యక్రమం `నేత్రావధానం' అందరినీ అలరించనుంది.
హరికథ, బుర్రకథ, చెక్కభజన, ఒగ్గు కథ, బుట్ట బొమ్మలు, ధింసా, పులివేషం, లంబాడి నృత్యం వంటి జానపద కళారూపాలను సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించనున్నారు. నాటికలు, నాటకాలు, శాస్త్రీయ సంగీతం, నృత్యాలు అందరినీ అలరించనున్నాయి. యూత్ ఫ్యాషన్ షో, సినిమా తారల ప్రదర్శనలు రెండు రోజులపాటు ఉర్రూతలూగించనున్నాయి. మా టీవీ- తానా సంయుక్తంగా నిర్వహించిన `నా యెద సవ్వడి' సూపర్ సింగర్ పోటీ ఫైనల్స్ పోటీని సభలలో భాగంగా నిర్వహించనున్నారు. గాయకుడు మనో నిర్వహణలో సాగే ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు, నగలు, రకరకాల వస్తువుల విక్రయానికి దాదాపు 250 స్టాల్స్ ఏర్పాటవుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈసారి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి.
తెలుగు వేడుకలు అనగానే వంటలూ పిండివంటలూ ప్రధానపాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పప్పు, వంకాయ, సాంబారు, ఆవకాయ, గోగూర, అప్పడం వంటి అచ్చతెలుగు పదార్థాలతో పాటు ఈసారి దాదాపు 40 రకాల శాకాహార, మాంసాహార వంటకాలతో షడ్రసోపేతమైన భోజనాన్ని తానా 17వ మహా సభల సందర్భంగా వండి వడ్డించనున్నారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 22 June, 2009
|