సంగీత సాహిత్య సమ్మేళనం
తరువాత మధ్యాహ్న భోజనాన్ని మయూరి ఆహారశాల యాజమాన్యం అందించింది. భోజనానంతరం ప్రసిధ్ధ వక్త పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అమోఘమైన కంచుకంఠంతో, తెలుగు భాషను భావి తరాలకి అందించడంలో ప్రవాసాంధ్రుల పాత్ర గురించి, ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చినా దానికి తగ్గ వైభవానికింకా నోచుకోని తెలుగు భాషకి పడుతున్న దుర్గతి గురించి ఆవేదన చెందారు. అందరిలో ఆలోచన రేకెత్తించారు. తరువాత వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా నటుడు, గాయకుడు అయిన డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ సుమధుర గాత్రంతో, వాక్పటిమతో తెలుగు భాషలోని, సినీరంగంలోని గొప్పతనాన్ని, అప్పటిదాక మాట్లడిన వక్తల ప్రసంగాలలో విశేషాల్ని విశ్లేషించారు. ఆయన పద్యాలతో ఆహూతులను సుమధుర లోకాలలో తేలియాడించారు. పిమ్మట జానపద వాగ్గేయబ్రహ్మ డాక్టర్ అందెశ్రీ రసభరితమైన స్వరంతో, పల్లెతల్లి శోభల గురించి, జనజీవన స్రవంతి గురించి శ్రావ్యంగా గానం చేశారు.
తేనీటి విరామం తరువాత అవధాని డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్ ఆధ్వరంలో నేత్రావధాన ప్రక్రియను కళాప్రపూర్ణులు నిడమర్తి లలితా కామేశ్వరి, కాశీభొట్ల రమాకుమారి అత్యద్భుతంగా ప్రదర్శించారు. పులిగండ్ల విశ్వనాధం సూత్రధారిగా పది మంది స్థానిక మహిళలు కలిసి ఇచ్చిన తికమక ప్రశ్నలను కేవలం కంటిభాషతో విడమర్చి, ప్రేక్షకుల ప్రశంసలందుకొన్నారు. తరువాత జరిగిన అవధాన కార్యక్రమం తెలుగు అవధాన చరిత్రలోనే ఒక అద్భుతం. తిరుపతి వేంకట కవుల తరువాత, సుమారు వందేళ్ల అనంతరం ఇద్దరు మహా అవధానులు కలిసి అష్టావధానం చేసిన దాఖలాలు లేవు. స్థానిక సాహిత్య ప్రముఖులు, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్ ఆధ్వరంలో పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్, ఆశుకవితా సమ్రాట్టు డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్ ఇద్దరూ జంట అష్టావధానం చేయడం సాహిత్య ప్రియులందరికీ వరప్రసాదమైంది. పృచ్ఛకుల అసమాన ప్రతిభతో, అవధానుల అసాధారణ మేధాశక్తితో, అప్రస్తుత ప్రసంగీకులు వంగూరి చిట్టెంరాజు చలోక్తులతో, చక్కటి సాంకేతిక సహకారంతో జరిగిన లేఖకుల రాతలతో ఈ కార్యక్రమం అందరినీ ఆనందింపజేసింది. ఈ అవధానంలో కొత్తగా నిర్వహించిన 'యాంత్రిక గణితం' అనే అంశం అందరినీ అలరించింది. మహా అవధానులు ఇద్దరికీ డల్లాస్ లోని తెలుగు వారందరి తరఫునా టాన్ టెక్స్ నిర్వాహకులు కనకాభిషేకం చేసి సత్కరించారు.
ఇప్పటి దాకా జరిగిన సభ ఒక ఎత్తయితే తర్వాత జరిగిన సంరంభం మరో ఎత్తు. సాయంకాలం విందు తర్వాత స్థానిక ప్రతిభకు చక్కని గుర్తింపు తెచ్చే నృత్య ప్రదర్శనలతో వినోదం మొదలైంది. నాట్యాంజలి, అభినయ నృత్య కళాశాలల నుంచి గురుశిష్యులు కలిసి రామయణ నృత్య రూపకాన్ని అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. కుమారి శ్రీజ చేసిన శాస్త్రీయ నృత్యం అందరి మనసులు దోచుకుంది. ఈ అపురూప నృత్య విన్యాసాల తరువాత దిగివచ్చిన తారలు ఇచ్చిన సంగీత సాహిత్య ప్రదర్శనతో సంగీత సాహిత్య నృత్య సమ్మేళనంలో తలపెట్టిన త్రివేణీ సగమం పూర్తయింది.
Pages: -1- -2- 3 -4- News Posted: 14 July, 2009
|