సంగీత సాహిత్య సమ్మేళనం
మొదట అభ్యుదయ యువ సినీ కవి చంద్రబోసు సందేశాత్మకమైన తన రచనల్ని సుమధురమైన గొంతుతో వినిపించి కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు అందించిన ప్రేమను, మొదటిసారిగా డల్లాస్ తెలుగు వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. పిమ్మట తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలందరినీ టాన్‌టెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు దుశ్శాలువలో, పుష్పగుచ్ఛాలతో, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఇంకా డాక్టర్ పుదూరు జగదీశ్వరన్ రాసిన 'డాలసాంద్రులశోభ' అనే ప్రత్యేక గ్రంథాన్ని ఇద్దరు అవధానులు ఆవిష్కరించారు.
తరువాత నేపథ్య గాయకులు మనో ఆనాటి విభావరికి ఉత్తేజం కలిగించే తన పాటలతో శ్రీకారం చుట్టారు. ఆనక డల్లాస్ లో తెలుగు వారందరికీ ఆప్తుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రి తన ఉపన్యాసంలో అత్యంత ఉత్సుకతో, అప్పటిదాకా వివిధ ప్రసంగాల్లో అందరూ ప్రస్తావించిన, సినీ సాహిత్యం, సినీ రంగ పురోగతి, తిరోగతి, తెలుగు భాషా సంస్కృతి గురించి, మన గురుతర భాధ్యత గురించి సమగ్రంగా ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలతో, ఆవేశపూరితమైన సమాధానలతో అతిథులను ఉత్తేజపరిచారు.
అనంతరం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన పల్లెపాటల దిట్ట గోరటి వెంకన్న శక్తివంతమైన స్వరంతో, అనూహ్యమైన పాటలతో, ఉత్సుకతతో ఉర్రూతలూగించారు. స్వర్గీయ మైకేల్ జాక్సన్ కు నివాళులర్పిస్తూ ఆయన పాడిన thriller - beat it beat it పాటకి తెలుగు పుంతలు కలిపిన ఆయన గొంతు గాంభీర్యంతో సభ దద్దరిల్లింది. సంగీత ప్రియులు, పల్లె ప్రియులు, చిన్నా పెద్దా అందరూ ఆయన పాటలకు లేచి గంతులు వేశారు. మిగిలిన రాత్రంతా మనో, గాయని ఉష గాన ప్రతిభతో ఎంతో రసవత్తరంగా సాగిపోయింది.
చివరిగా రావు కలవల ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు, HEB స్కూలు యాజమాన్యానికి, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, చక్కని విందు భోజనం అమర్చిన మాయూరి రెస్టారెంటు వారికి, టాన్‌టెక్స్ వారి, సభాలంకరణ జట్టు, సభ్యత్వ జట్టు, ఆహార విభాగం, సాంకేతిక విభాగం, సాంస్కృతిక విభాగం, 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వందన సమర్పణ చేశారు.
మనిషి ఒక్కడే చెయ్య లేనిది, సంఘ రూపంలో సమష్టి కృషితో సాధించగలడు అనడానికి అత్యంత వైభవోపేతంగా, ఒక యజ్ఞంలా జరిగిన ఈ మహాసభ ఒక ఉదాహరణ. దీనికి దోహదపడిన వారందరికీ నమస్సుమాంజలులు తెలిపింది డల్లాస్ లోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం.
Pages: -1- -2- -3- 4 News Posted: 14 July, 2009
|