'పటాన్ చెరు వరకూ మెట్రో'?
హైదరాబాద్ : మెదక్ జిల్లా పటాన్ చెరు వరకూ మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. మేటాస్ సంస్థ ఇబ్బందుల్లో ఉన్నందున మెట్రో ప్రాజెక్టు పనుల ప్రారంభం మూడు నాలుగు నెలలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి నాలుగేళ్ళలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే మెట్రో ప్రాజెక్టును పటాన్ చెరు వరకూ పొడిగించాలని చాల మంది కోరుతున్నారని, ప్రాజెక్టును పొడిగించేందుకు గల సాధ్యాసాధ్యాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. మన రాష్ట్రానికి చెందిన లోక్ సభ సభ్యుడు ఎస్. జైపాల్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నందువల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధికంగా అన్ని విధాలా సహాయం అందుతోందన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి 2,300 కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇప్పటికే జైపాల్ రెడ్డి మంజూరు చేయించారన్నారు. హైదరాబాద్ - సికిందరాబాద్ జంట నగరాల్లో మూడు రోజుల సుడిగాలి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రెండో రోజు బుధవారంనాడు ఎర్రగడ్డ, చందానగర్ తదితర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరి కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా చందానగర్ లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ఆసాంతమూ నగరానికి తమ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెడుతూ, భవిష్యత్తులో ఏయే కార్యక్రమాలు చేయనున్నదీ వివరిస్తూ, ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అందించిన విజయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని పొగడుతూ కొనసాగించారు.
జైపాల్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఉండకపోతే హైదరాబాద్ లో మొదలైన 4 వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభమై ఉండేవా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ 4 వేల కోట్ల రూపాయల పనుల్లో చాలవరకూ డ్రైనేజిలు, రోడ్లు, భూగర్భ డ్రైనేజిలు, సివరేజి ప్లాంట్లు, మంచినీటికి సంబంధించిన కార్యక్రమాలే జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే వెయ్యి కొత్త బస్సులు వస్తాయని ఏ ఒక్కరైనా ఎప్పుడైనా ఊహించగలరా అని వైఎస్ అన్నారు. సంవత్సరం లోగా నగరంలో ఈ నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వైఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్ కు మంచినీటి అందించే కృష్ణా నీటి సరఫరా పథకం రెండో దశను పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిల్లో ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
Pages: 1 -2- News Posted: 15 July, 2009
|