సోనియా వద్దకు జగన్! హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యేందుకు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుమతి లభించింది. జగన్ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో అక్టోబర్ మొదటి వారంలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఆమెతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, తదితరులతో జగన్ భేటీ అయ్యే వీలుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ మృతి అనంతరం రాష్ట్రానికి వచ్చి తమ కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో సోనియా గాంధీకి జగన్ కృతజ్ఞతలు తెలిపేందుకు ఉద్దేశించిన సమావేశమేనని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, రాష్ట్రంలో వైఎస్ మృతి అనంతరం జరిగిన అనేక అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో అధిష్టానంతో జగన్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏ చిన్న అవకాశం దొరికినా వైఎస్ విధేయ వర్గం అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది.
కర్నూలు జిల్లా నల్ల కాలువ వద్ద జరిగిన వైఎస్ సంస్మరణ సభలో జగన్ ప్రసంగం తీరు గురించి కాంగ్రెస్ అధిష్టానం ఇంటిలిజెన్స్, పీసీసీ ద్వారానే కాకుండా ఇతర వ్యక్తుల ద్వారా కూడా సేకరించింది. వైఎస్ ఆకస్మిక మృతి అనంతరం రాష్ట్రంలోని పరిణామాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని సోనియా గాంధీ తన సన్నిహితులను ఆదేశించినప్పుడు తెలుస్తోంది. సీఎం పదవిపై సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో వైఎస్ విధేయ వర్గం బలాబలాను కూడా సోనియాకు నివేదించే అవకాశం ఉంది. జగన్ ను సీఎం చేయాలంటూ ప్రదర్శనలతో పాటు కొన్ని జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నీ జగన్ అభిమానులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాలో సోనీయా గాంధీ చిత్రపటం చించివేత పెద్ద దుమారాన్ని లేపింది. తూర్పు గోదావరి జిల్లాలో రెండు బస్సులను దహనం చేశారు. సోనియా చిత్రపటం చించివేత వ్యవహారంలో దోషుల్ని శిక్షించాలని, స్వయం ప్రకటిత సంఘాలతో తనకు సంబంధం లేదని జగన్ ప్రకటించాల్సివచ్చింది.
Pages: 1 -2- News Posted: 29 September, 2009
|