`తానా'వారె పరులైన ఓట్లేల?
హైదరాబాద్: ఉపాధి కోసం సప్త సముద్రాలు దాటి అమెరికాలో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఇటీవలి కాలంలో నేతల ఆధిపత్య ప్రదర్శనకు వేదికయింది. పదవుల కోసం, పరపతి కోసం పరస్పరం కత్తులు దూసుకొని కోర్టులకెక్కిన నాయకులపై, మొదటినుంచీ సంస్థను వెన్నంటి ఉన్న పలువురు సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. సభ్యుల అభిప్రాయాలకు విలువ లేకుండా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఈమేరకు 103 మంది సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.
తాము ఎంతగానో అభిమానించే తానాలో ఈమధ్య నెలకొన్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని పేర్లతో, ఇంటిపేర్లతో సుపరిచితులైన ప్రవాస భారతీయులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా పన్ను మినహాయింపులతో నడుస్తున్న తానా అమెరికా నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహారాలు సాగించాలి. కాని అధికారంలో ఉన్నవారి ఇష్టారాజ్యం సాగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం తానా చుట్టూ అల్లుకున్న కొద్దిమంది నేతలు సంస్థ ప్రణాళికలను, సమాచారాన్ని తమ కబంధ హస్తాల్లో దాచిపెట్టుకుంటున్నారు. సంస్థపై మమకారం ఉన్న సభ్యులు నెత్తీనోరూ బాదుకున్నా వినిపించుకునే నాధుడే కరవయ్యాడు. ఎన్నికల్లో గెలుపు కోసం బోగస్ సభ్యులను చేర్పించినట్లు ఆరోపణలు వచ్చినపుడు కూడా నాయకులకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. దాంతో, తొలిసారి సంస్థపై కొందరు సభ్యులు న్యాయస్థానంలో కేసు వేశారు. సభ్యుల నమోదు వివరాలను చూపించేలా నాయకత్వాన్ని ఆదేశించాలంటూ కోర్టును వేడుకోవలసిన దుస్థితి దాపురించింది.
Pages: 1 -2- -3- News Posted: 25 February, 2009
|