ఏయూ మైదానంలో ఎగ్జిబిషన్
విశాఖపట్నం : నగరంలో శివాజీ పార్క్ సమీపంలోని ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన వైష్ణోదేవి ఆలయం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ కు సమీపంలో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైష్ణోదేవి ఆలయం మాదిరిగానే ఈ ఆలయం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శివాజీ పార్క్ సమీపంలోని ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన ఆలయాన్ని చూస్తే జమ్మూ కాశ్మీరు లోని వైష్ణో దేవిని చూసినట్లుగానే అనుభూతి చెందుతారని అన్నారు. 12 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేశారు. ఏప్రిల్ 1 నుండి ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు రాజారెడ్డి, గోపాలకృష్ణ వెల్లడించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో అమర్ నాథ్ యాత్ర ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రజల స్పందన ఎంతో బాగుందన్నారు. తమిళనాడుకు చెందిన 300 మంది కార్మికులు 30 రోజుల పాటు కష్టపడి 320 అడుగుల పొడవు, 182 అడుగుల వెడల్పు, 80 అడుగుల ఎత్తుతో నిర్మించారన్నారు. వైష్ణోదేవి ఆలయంలో ఉన్నట్లుగానే అమ్మవారు సరస్వతీ, మహాలక్ష్మి, కాళికాదేవి అవతారాల్లో దర్శన మిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కళాఖండాలు, మహిళలకు చీరలు, చిన్నారలుకు ఆటవస్తువులు వంటివి 300 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మే నెలలో ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటలవరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
News Posted: 1 April, 2009
|