కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
విజయవాడ : ఎన్నికల హడావుడి ముగియడం, విద్యార్థులకు సెలవులు తోడవడంతో ఇంద్రికీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. దుర్గమ్మకు ప్రీతికరమైన శుక్రవారం భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భానుడి ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా క్యూలైన్లలో బారులు తీరారు. ఘాట్ రోడ్డులో ఓ టర్నింగ్ వరకూ భక్తులు వాహనాలను పార్కింగ్ చేయడంతో ఆ ప్రాంతమంతా రద్దీ ఎక్కువైంది. కొండపైకి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులలోనే భక్తులు కొండపైకి చేరుకున్నారు. ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ, సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి వరకూ రద్దీ కొనసాగింది. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన చలువ పందిర్లలో భక్తులు సేదదీరారు. దుర్గమ్మ ప్రధాన ఆలయంతో పాటు, మల్లేశ్వరాలయాలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ప్రసాదాల కౌంటర్లు, అన్నదానం క్యూకాంప్లెక్స్ కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది.
News Posted: 25 April, 2009
|