శ్రమ ఫలించింది: దాసరి
విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు విజయోత్సవ వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి దాసరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 40 కిలోల కేకును దాసరి కట్ చేశారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కడియాల రాఘవరావు, గన్నవరం సర్పంచి తులసీమోహన్, మండల పార్టీ అధ్యక్షుడు బోసు, చిన్నారామారావు, నాయకులు ఉమావరప్రసాద్, కాట్రగట్ట అరుణ తదితరులు దాసరికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ గన్నవరం నియోజక వర్గ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల ముందు రెండు నెలలు నియోజకవర్గంలో మండుటెండల్ని కూడా లెక్క చేయకుండా చేసిన పాద యాత్ర, గత 15 సంవత్సరాలుగా దాసరి ట్రస్టు ద్వారా ప్రజలకు చేసిన సేవే తనను ఎమ్మెల్యేగా గెలిపించాయని గన్నవరం ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను తెలుసుకున్నాననీ, వాటి పరిష్కారానికి ఆత్మ వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేనప్పటికీ బందరు ఎంపీ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
News Posted: 18 May, 2009
|