వైఎస్ రాజకీయ ప్రస్థానం
వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'రియల్ హీరో'గా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జూలై 8న నిర్వహించుకుంటున్న 60 జన్మదినోత్సవం ఆయన అభిమానులు, పార్టీ వాదులకు ప్రత్యేకమైన రోజు అని వైఎస్సార్ యువసేన యుఎస్ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి అభివర్ణించారు. వైఎస్సార్ పుట్టినరోజు సంబరాలను అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. దివంగత వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు రెండో కుమారుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి 59 సంవత్సరాల క్రితం పులివెందులలో జన్మించారని నాగిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన ప్రస్థానంలోని పలు కీలకాంశాలను ఈ సందర్భంగా నాగిరెడ్డి గుర్తు చేశారు.
- గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఎంబిబిఎస్ పూర్తిచేసిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులోని మిషన్ ఆస్పత్రిలో వైద్యాధికారిగా సేవలు అందించారు.
- 1973లో పులివెందులలో 70 పడకలతో ధర్మాసుపత్రిని ఏర్పాటు చేశారు. తన తండ్రి మరణానంతరం ఆ ఆస్పత్రికి వైఎస్ రాజారెడ్డి ధర్మాసుపత్రిగా పేరు పెట్టారు.
- పులివెందులలో తాను ఏర్పాటు చేసిన ధర్మాసుపత్రిలోనే వైఎస్ వైద్యునిగా తన జీవన ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఈ ఆస్పత్రిని వైఎస్ రాజారెడ్డి కట్టించారు. ఆ రోజుల్లోనే రోగుల నుంచి ఒక్క రూపాయి తీసుకుని గాని, పూర్తిగా ఫీజు తీసుకోకుండా గానీ వైఎస్ వైద్య సేవలు అందించారు.
- వైఎస్ రాజకీయ ప్రస్థానం చాలా ఆశ్చర్యకరంగా మొదలైంది. వైఎస్ లోని రాజకీయ చైతన్యాన్ని పసిగట్టిన సన్నిహిత కాంగ్రెస్ పార్టీ మిత్రుడొకరు ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు.
- యువజన కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటూ తాను కోరకుండానే వచ్చిన కార్యదర్శి పదవికి వైఎస్ తనదైన శైలిలో వన్నె చేకూర్చారు. వైఎస్ వ్యవహార సరళిని గమనించిన ప్రజలు ఆయనలో గొప్ప నాయకుడున్నాడని గుర్తించారు. రాజశేఖరరెడ్డి నాయకత్వ సామర్ధ్యం పట్ల వైఎస్ రాజారెడ్డి కూడా సంతృప్తి చెందారు.
- 1978లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రావడంతో వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా బ్రేక్ వచ్చినట్లైంది. అప్పటికి ఆయన వయస్సు 29 సంవత్సరాలు. అనంతరం అంజయ్య మంత్రిమండలిలో వైఎస్సార్ కు ఎక్సైజ్ శాఖ మంత్రిగా అవకాశం దక్కడం మరో విశేషం.
- 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వీచిన తెలుగుదేశం గాలిలో కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలంతా గంపగుత్తగా ఓడిపోయిన సందర్భంలో కూడా పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా సునాయాసంగా ఎన్నికవడం విశేషం.
Pages: 1 -2- -3- -4- News Posted: 9 July, 2009
|