ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
విశాఖపట్నం : ఆంధ్రాయూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ మైదానంలో జరుగుతున్న ఆర్మీ జవాన్ల ఎంపికలో నాలుగువేల మంది అభ్యర్థులు పోటీకి ఎంపికయ్యారు. గురువారం దేహదారుఢ్య పరీక్షలు, పరుగు, వైద్యపరీక్షలు నిర్వహించారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీకి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, యానాం , తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాలనుంచి సుమారు 12వేల మంది యువకులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల ప్రాథమిక తనిఖీలో తొమ్మిది వేల మంది అభ్యర్థులు అర్హత సాధించినా, వైద్య పరీక్షల అనంతరం నాలుగువేలమంది అభ్యర్థులు పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పరుగు, దేహధారుఢ్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. సైనిక నియామక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ పంకజ్ సిన్హా ఎంపిక పరీక్షలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొదటి మూడురోజులలో కేవలం 450 మంది మాత్రమే రాతపరీక్షకు ఎంపికయ్యారు. సోల్జర్ జనరల్‌డ్యూటీ, క్లర్క్, నర్శింగ్ అసిస్టెంట్, స్టోర్‌కీపర్, టెక్నికల్ విభాగాలలో ఉన్న పోస్టుల భర్తీకోసం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బ్రోకర్లు మోసం చేస్తున్నారని, ఎవరూ మోసపోవద్దని పూర్తి పారదర్శకంగా ఆర్మీ ఎంపిక జరుగుతుందని సిన్హా స్పష్టం చేశారు.
News Posted: 7 August, 2009
|