మన ఘనుడు ఎంఎన్ఆర్
వట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్....
సొంతలాభం కొంత మానుకుని
పొరుగువాడికి సాయపడవోయ్... తరాలు గడిచిపోయినా.. ఆంధ్రలు తలరాతలు మారిపోయినా ఇలాంటి మంచి మాటలను చెవికెక్కించుకోవడం చాలా అరుదై పోయింది. ఎప్పుడో శతాబ్దకాలం క్రితం మహాకవి గురజాడ చేసిన ప్రబోధం. అబ్బే చెవికెక్కదు. కన్యాశుల్కంలో గిరీశాన్ని ఆదర్శంగా తీసుకున్నోళ్ళు కోకొల్లలు మనకు. అందుకే ఆయనే అన్నారు.. మనోళ్లు వట్టి వెధవాయిలోయ్! అని. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులని, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులని తిడుతూనే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు.. పావన నవ జీవన బృందావన నిర్మాతలనీ కీర్తించాడు మహాకవి శ్రీశ్రీ... శ్రీశ్రీ పొగిడిన యువతరానికి ప్రతినిధిగా, గురజాడ అడుగుజాడను అనుసరిస్తున్న యువకుడే అతడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా... ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా తెలుగు'వాడి' చూపిస్తూ తెలుగువాణిని వినిపిస్తూ విశ్వవీధిలో తళుక్కుమంటున్న ఓ భీమవరం ఆణిముత్యం... అతడే మద్దుల నాగభూషణ రావు గుప్త ...
ప్రశ్నించేవాడికే పరిష్కారం దొరుకుంది. అసలు ప్రశ్నే లేకపోతే... మానవజాతి మనుగడ అంగుళం ముందుకు కదలదు. ఇది ఇలాగే ఎందుకుండాలి? అనే ప్రాథమికమైన ప్రశ్న మానవ మెదడులో చొరబడకపోయి ఉంటే ఈనాటి మానవాళి అభివృద్ధి ఏదీ? ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు ఓ అడుగు ముందుకు వేస్తాడు... ఆ తరువాత ఆ దారిలో మొత్తం మానవజాతి పయనం మొదలై సాగిపోతుంది. ప్రపంచ మానవుల్ని ఉత్తేజితం చేసి వారిలో కొందరిని మార్గదర్శులుగా నిలబెట్టే మహానుభావులు ఉంటారు. భారతీయాత్మను విశ్వమానవ ఆత్మగా, తరతరాలపై చెరగని ముద్రవేసిన దార్శనికుడు స్వామి వివేకానంద ప్రవచనాలతో స్పూర్తి పొందిన ఎంఎన్ఆర్ గుప్త... చదువుకునే రోజుల్నించే సమాజాన్ని గురించిన ఆలోచనలు చేశాడు. అంతమాత్రాన భూమిని ఉద్దరించాడని, మానవ సేవలో తరించాడని చెప్పబోవడం లేదు. తన తరం... ఈతరం యువతరంగంలో ఒక కొత్త కెరటమై లేచాడు. చాలామంది చేయనిది చేసి చూపించాలన్న తపనతో ఉన్నాడు. సాధించినదానికి సంతృప్తిపడిపోవడం లేదు. అసలు గుప్త కంటే తెలివైనవారూ...చేయగలిగేవారూ వందలు వేల సంఖ్యలో ఉండొచ్చు. కానీ గుప్త గురించే చాలామంది ఎందుకు చెప్పుకుంటారంటే... అతను అనుసరిస్తున్న మార్గం కొంచెం భిన్నమైనది. తన వారికి అంటే తన దేశ ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన..తపస్సు...దానిని నిజం చేయడానికి నిరంతరమైన ఆలోచన.. అలుపెరగని శ్రమ. శ్రమించనిదే ఆలోచనకు వాస్తవరూపం రాదని, ఆలోచనకు ప్రశ్నే పునాదని నమ్మే గుప్త... ఎక్కడో విదేశాలలో జీవనం సాగిస్తున్నప్పటికీ మాతృదేశానికీ అందునా ఆంధ్రదేశానికి సేవలు అందిస్తూనే ఉన్నాడు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే యత్నం చేస్తున్నాడు.
Pages: 1 -2- -3- News Posted: 24 March, 2010
|