బిజెపిలో ఇక సేనాపతులు!
న్యూఢిల్లీ: 'అద్వానీ ఒక్కరే' అనే విధానం నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి) తప్పుకుని 'సమష్ఠి నాయకత్వం' అనే విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా ప్రచారం చేయసాగింది. ఆదివారం నాగపూర్ లో ముగిసిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఎల్.కె. అద్వానీ స్వయంగా ఎన్నికల వ్యూహంలో మార్పు తీసుకువచ్చారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను తయారు చేసుకున్న బృందంపై ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
'ఛాయా' ప్రధాని అద్వానీ తన లిఖిత ప్రసంగాన్ని పక్కన పెట్టి తాను దానిని చదివినట్లుగా భావించవలసిందని మీడియాకు సూచించి బిజెపి ద్వితీయ శ్రేణి నాయకుల బలం గురించి విశేషంగా చెప్పనారంభించారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడి, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ లను ఆయన పేరు పేరునా ప్రస్తావించి వారి 'అసాధారణ అవగాహన, ప్రావీణ్యం' గురించి ప్రశంసిస్తూ ప్రసంగించారు.
నాగపూర్ సమావేశాలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చేసిన ఒక సూచన ఈ మార్పునకు దారి తీసింది. తమ నాయకుని వయస్సు అవరోధం గురించి మోడి ప్రస్తావించి, సోనియా బృందం కన్నా అద్వానీ బృందం పిన్న వయస్కులతో కూడుకున్నదని చెప్పారు. అద్వానీ నాయకత్వంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేస్తుండడం పార్టీకి పెద్దగా మేలు చేయడం లేదని, ప్రచారంలో ఊపు కోసం మరేదైనా పంథా అనుసరించవలసిన అవసరం ఉందని సీనియర్ నాయకులు కూడా అభిప్రాయం వెలిబుచ్చినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
Pages: 1 -2- -3- News Posted: 10 February, 2009
|