బెంగళూరులో బళ్లారి ప్రతిధ్వని
ఆ ముగ్గురిలో అందరికన్నా చిన్నవాడైన సోమశేఖరరెడ్డి నుంచి బహిరంగంగా విమర్శ వెలువడింది. ముఖ్యమంత్రి శాసనసభ్యులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అసంతృప్తి చెందిన శాసనసభ్యులలో కొందరితో రెడ్డి సోదరులు సమాలోచనలు సాగిస్తున్నట్లున్నారు. కాగా, ఈ విషయమై వ్యాఖ్యానించడానికి రెడ్డి సోదరులలో ఎవరూ అందుబాటులో లేకపోయారు.
ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములుతో పాటు రెడ్డి సోదరులు 2008 ఎన్నిక సమయంలో బిజెపి కీలకమైన అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేశారు. పార్టీ బలం పెంచుకోవడానికి ప్రత్యర్థి పార్టీల నుంచి శాసనసభ్యులను ఆకర్షించడంలో కూడా వారు ముందు నిలిచారు. 'పార్టీ అధికారంలోకి రావడావికి వారు (రెడ్డి సోదరులు) సాయం చేశారనడంలో సందేహం లేదు. అయితే, నాయకత్వాన్ని చేజిక్కించుకునే స్థితికి వారు వచ్చారా' అని బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. 'ఇది (తిరుగుబాటు) తేలిపోగలదు... ముఖ్యమంత్రి కూడా ఈ విషయాలలో చాలా గట్టిగా వ్యవహరిస్తారు' అని ఆ నాయకుడు చెప్పారు.
మంత్రివర్గంలో నుంచి కనీసం ఆరుగురికి యెడ్యూరప్ప ఉద్వాసన పలకాలని రెడ్డి సోదరులు కోరుతున్నట్లు తెలుస్తున్నది. కాగా ముఖ్యమంత్రితో విడిగా ఘర్షణ వైఖరిని అనుసరిస్తున్న ఇంధన శాఖ మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప వంటి అసంతృప్త మంత్రులు విధాన నిర్ణయంలో తమకు పాత్ర ఉండాలని గట్టిగా కోరుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి యజమానులైన, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలు ఉన్న రెడ్డి సోదరులతో రాష్ట్రంలో ఏడాదిగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి వైమనస్యాలు ఏర్పడడం ఇదే మొదటిసారి. కర్నాటకలోని 28 లోక్ సభ సీట్లలో 19 సీట్లను పార్టీకి సాధించడం ద్వారా యెడ్యూరప్ప తన బలాన్ని పటిష్ఠం చేసుకున్న సమయంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో బిజెపికి మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువగా సీట్లు రాలేదు.
అయితే, రాష్ట్రంలో అతి పెద్ద వోటు బ్యాంకు అయిన లింగాయత్ కులానికి చెందిన నాయకుడైన కారణంగా యెడ్యూరప్పకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గీయులు అందరూ ఒక్కటైనా ఆయనను పదవీచ్యుతుడిని చేయడం తేలిక కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 13 June, 2009
|